విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ శివశంకర్ అవినీతి అరోపణల మీద దర్యాప్తు జరపాలి - నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 

విక్రమ సింహపురి విశ్వవిద్యాయలం సోషల్ వర్క్ రీసెర్చ్ స్కాలర్ సుధీర్ ఆత్మహత్యకు రిజిస్ట్రార్ శివశంకరే కారణమని వస్తున్న అరోపణల మీద దర్యాప్తు చేయాలని నెల్లూరు రూరల్ శాసన సభ్యుడు (వైఎస్ఆర్ సి) కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గవర్నర్ ఇఎస్ ఎల్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు.

 ఐసిఎస్ ఎస్ ఆర్ జెఆర్ ఎఫ్ కు దరఖాస్తుచేసుకుంటే, దానిని రిజిస్ట్రార్ పంపక పోవడంతో తీవ్రమానసిక వేదనకు గురయి, యూనివర్శిటీ భవనం ఎక్కి దూకి సుధీర్ ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతున్నారని, దీని మీద దర్యాప్తుజరగాల్సిన అవసరం ఉందని శ్రీధర్ రెడ్డి ఈ రోజు గవర్నర్ కు రాసిన ఒక లేఖలోపేర్కొన్నారు.

రిజిస్ట్రార్ అవినీతి గురించి పత్రికలలో విపరీతంగా వార్తలు వస్తున్నాయని, వీటిని దర్యాప్తు చేసి నిజానిజాలేమిటోతేల్చి తగినచర్య తీసుకొనకపోతే నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయం అపకీర్తి పాలవుతుందని ఆయన చెప్పారు.

యూనివర్శిటీకి సొంత భవనాలు ఉన్నా నెలకు రు. 2.5 లక్షలు అద్దె చెల్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయని కూడా ఆయన గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇలా అద్దెకు యూనివర్శిటీ మూలధనం ఖర్చుచేయడం గురించి దర్యాప్తు జరగాలని ఆయన కోరారు. ఇదే విధంగా విశ్వవిద్యాలయం భూములను అక్వాసాగుకు ఇచ్చేందుకు కూడా ప్రయత్నాలు కూడా జరిగాయలనే వార్తలు వచ్చాయని, ఈ విషయం బయటకు పొక్కడంతో అక్వాసాగుదారులతో ఒప్పందం రద్దు చేసుకున్నారని చెబుతున్నారని ఆయన లేఖలో రాశారు.

యూనివర్శిటీ రిజిస్ట్రార్ మీద వచ్చిన అనేక అరోపణలను గవర్నర్ దృష్టికి తీసుకువస్తూ శివశంకర్ కార్యకలాపాల మీద సమగ్రమయిన దర్యాప్తు జరపాలని ఆయన కోరు.