హైదరాబాద్‌ : విశాఖపట్నం రైల్వే జోన్, పునర్విభజన చట్టంలోని హామీలను సాధనకై మాజీమంత్రి కొణతాల రామకృష్ణ మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. విశాఖరైల్వేజోన్, విభజన చట్టంలోని హామీలను అమలు చెయ్యాలని డిమాండ్ చేస్తూ ఈనెల 27న జన ఘోష రైలు యాత్ర నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. 

ఆంధ్రా ప్రజల జనఘోషను ఢిల్లీలో వినిపించడమే ఈ కార్యక్రమం యెుక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి ఉదయం ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో ఉత్తరాంధ్ర వేదిక బృందం బయలుదేరుతుందన్నారు. 

ఈ నెల 31 నుంచి కేంద్ర బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సమస్యలను వివిధ పక్షాల నాయకులు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు. 

ఐదు రోజుల పాటు ఢిల్లీలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ యాత్రకు రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు అందరూ మద్దతు ఇవ్వాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్, మాజీమంత్రి  కొణతాల రామకృష్ణ కోరారు.