విశాఖపట్నం: త్వరలోనే తిరిగి రాజకీయాల్లోకి రాబోతున్నట్లు మాజీమంత్రి ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ స్పష్టం చేశారు. ఇక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఏ పార్టీలో చేరేదీ త్వరలోనే చెబుతానని వెల్లడించారు.

ఫిబ్రవరి చివరిలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కినట్లేనని చెప్పారు. రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య అనైక్యత అధికార టీడీపీకి అనుకూలంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. 

టీడీపీకి కాంగ్రెస్‌ మిత్రపక్షంగా మారగా వైసీపీ, జనసేన, సీపీఐ, సీపీఎం, బీజేపీ వంటి పార్టీలు వాటి దారి అవే చూస్తున్నాయని అందువల్ల టీడీపీ పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండొచ్చన్నారు.  అయితే ఎన్నికల అనంతరం బీజేపీ తెరవెనుక ఉండి వైసీపీ, జనసేన మధ్య సఖ్యత కుదిర్చే అవకాశం కూడా ఉందన్నారు. 

రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్‌ క్రమేణా తగ్గుతున్నట్లుగా ఉందని అయితే జనసేనను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పవన్‌ కళ్యాణ్‌ దృష్టి సారించడం లేదని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరే సుజలస్రవంతి, విమ్స్‌ ప్రాజెక్టులను మంజూరు చేయడమే కాకుండా, పనులు ప్రారంభానికి అవసరమైన నిధులను దశలవారీగా మంజూరుచేస్తున్న సీఎం చంద్రబాబును కొణతాల ప్రశంసించారు.