అమరావతి: న్యాయవ్యవస్థ ఇచ్చిన తీర్పుని జీర్ణించుకోలేని వ్యక్తి మాటల్లానే మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలున్నాయని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. బాధ్యతాయుతమైన   మంత్రి పదవిలో వున్న పెద్దిరెడ్డి అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని... ఎన్నికల నిర్వహణ ప్రక్రియకు విరుద్ధంగా ఆయన మాటలున్నాయని ఆరోపించారు. బుధవారం కొమ్మారెడ్డి మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
   
''రాజ్యాంగ ప్రక్రియకు విరుద్ధంగా, చట్టవిరుద్ధంగా న్యాయస్థానాల తీర్పుని ధిక్కరించేలా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. రాజ్యాంగవిరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై ఎస్ఈసీ తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఆయన్ని కేబినెట్ నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి'' అని డిమాండ్ చేశారు.

''హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఉల్లంఘించిన కారణంగా ఎస్ఈసీ కొందరు అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని తప్పుపడుతూ సదరు అధికారులను తిరిగి విధుల్లోకే తీసుకుంటామని మంత్రిపెద్దిరెడ్డి చెప్పడం ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది. అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకోవడమంటే రివర్స్ టెండరింగ్ అని మంత్రి పెద్దిరెడ్డి అనుకుంటున్నాడా? రాజ్యాంగంతో కూడుకున్న వ్యవహారమని తెలుసుకోండి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశాలను రివర్స్ చేస్తాను, నా ఇష్టానుసారం చేస్తానని అనుకుంటే రాజ్యాంగం, న్యాయస్థానాలు, చట్టాలు ఒప్పుకోవని పెద్దిరెడ్డి అర్థంచేసుకోవాలి'' అని సూచించారు.

''జనవరి 12న హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం ఏమని అఫిడవిట్ ఇచ్చిందో తెలుసా? ఎన్నికల విధులకు సంబంధించి ఏమని చెప్పారు? జనవరి 22వ తేదీకల్లా అప్ డేటెడ్ ఓటర్ల జాబితాను  సమర్పిస్తామని చెప్పలేదా?  ఆనాడు అలాచెప్పిన మీరు, ఎన్నికల నిర్వహణకు అతికీలకమైన ఓటర్ల జాబితాను ఎందుకుతొక్కిపెట్టారో చెప్పాలి. ఆ విధంగా చేయడం హైకోర్టు తీర్పుని ధిక్కరించడం కాదా? హైకోర్ట్ చీఫ్ జస్టిస్ తన తుదితీర్పులో ప్రభుత్వం చెప్పిన అంశాన్ని ప్రస్తావించారు కూడా. సవరించిన ఓటర్ల జాబితాను, ప్రభుత్వం కోర్టుకి , ఎస్ఈసీకి సమర్పించకపోవడం వల్ల 3లక్షల 60వేలమంది ఓటర్లు తమ ఓటుహక్కుని కోల్పోయారు. అంతటి పెద్ద నేరానికి పాల్పడినవారిపై ఎన్నికల కమిషనర్ చర్యలు తీసుకుంటే దాన్ని తప్పుపడతారా?'' అని ప్రశ్నించారు.

''ప్రభుత్వంలో పనిచేసి ఇద్దరు అధికారులు రాజ్యాంగవిరుద్ధంగా ప్రవర్తించినందుకు, వారిపై ఎస్ఈసీ చర్యలు తీసుకుంటే వారిని రివర్స్ చేస్తామని పెద్దిరెడ్డి చెప్పడం కోర్టు దిక్కరణ కిందకే వస్తుంది. రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుచేయాలనే ఆలోచనల్లోంచి మంత్రి పెద్దిరెడ్డి ఇంకా బయటకువచ్చినట్లు లేరు. అధికారులను రివర్స్ చేస్తామని చెప్పడం ద్వారా పెద్దిరెడ్డి మంత్రి పదవికి అనర్హుడు, సదరు అధికారులపై ఒత్తిడితెచ్చి 3లక్షల60వేల మందికి ఓటుహక్కుని దూరంచేసిన వ్యక్తి మంత్రిగా కొనసాగడానికి పనికిరాడు. పెద్దిరెడ్డికి ఏం అర్హత ఉందని హైకోర్టు ఇచ్చిన తీర్పుని అగౌరవపరిచేలా మాట్లాడాడు. పెద్దిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్ఈసీ తప్పనిసరిగా రామచంద్రారెడ్డి వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు.

read more  సుప్రీంకోర్టు చెప్పినా కొందరు పెద్దలు దూషిస్తున్నారు: నిమ్మగడ్డ వ్యాఖ్యలు

''ఏడాదిక్రితం బలవంతపు ఏకగ్రీవాలపేరుతో ప్రభుత్వం చేసిన అరాచకాలు ప్రజలకు తెలియవనుకుంటున్నారా? మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో తంబళ్లపల్లి, పుంగనూరు నియోజకవర్గాల్లో జరిగిన ఏకగ్రీవాలు ఎంతటి హింసాయుతంగా సాగాయో అందరికీ తెలుసు. మంత్రి ఇలాఖాలో ప్రతిపక్షపార్టీ అభ్యర్థులను తరిమేశారని, రెండోరోజూ మంత్రి నియోజకవర్గంలో ఆగని అధికార పార్టీ దౌర్జన్యాలు, పుంగనూరులో చించేసిన నామినేషన్ పత్రాలు, అరాచకరాజ్యం సృష్టించారని పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాశారు. ఇటువంటి విద్యలన్నీ రామచంద్రారెడ్డికి వెన్నతో పెట్టిన విద్యలే కదా..'' అని ఆరోపించారు.

''పుంగనూరులో ఆరు జడ్పీటీసీలుంటే అన్నీ ఏకగ్రీవమే. 69 ఎంపీటీసీ స్థానాలకు 65ఏకగ్రీవాలు, తంబళ్లపల్లిలో 6 జడ్పీటీసీలుంటే ఆరు ఏకగ్రీవమే. 71 ఎంపీటీసీలుంటే 71 స్థానాలు ఏకగ్రీవాలు. నూటికి నూరుశాతం ఏకగ్రీవాలు ఎలా సాధ్య మయ్యాయో పెద్దిరెడ్డి చెప్పాలి. ముఖ్యమంత్రిని మించిపోయి మరీ పెద్దిరెడ్డి రౌడీయిజం చెలాయించాడని ఈ ఏకగ్రీవాలే చెబుతున్నా యి. ఆనాడు అలాచేసిన పెద్దిరెడ్డి నేడు పంచాయతీ ఎన్నికల్లో కూడా అలానే చేయాలని భావిస్తున్నట్లున్నారు. ప్రజలు ఇదివరకటిలా లేరని, వారిలోచైతన్యం పెరిగిందని ఆయన తెలుసుకుంటే మంచిది. వైసీపీని తరిమికొట్టడానికి వారంతా సిద్ధంగా ఉన్నారని మంత్రి గ్రహించాలి.  వైసీపీ పతనం పుంగనూరు నుంచే టీడీపీ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉంది'' అని మండిపడ్డారు.

''వైసిపి అనుకూల పత్రికతో సహా అనేక దినపత్రికల్లో నేడు ఏకగ్రీవాలకు సంబంధించి ప్రకటనలు ఇచ్చారు. ఆప్రకటనల్లో వేసిన సచివాలయ చిత్రం లోగో ఏదైతే ఉందో అది తెలంగాణకు చెందినది. పొరుగు రాష్ట్రానికి చెందిన లోగోను పత్రికల్లో ప్రచురించిన ఈ గుడ్డి ప్రభుత్వ నిర్వాకం ప్రజలంతా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రా లేక తెలంగాణాకా? తెలంగాణ ప్రభుత్వానికి చెందిన పంచాయతీ కార్యాలయ చిత్రాన్ని ఏపీకి చెందిన పత్రికా ప్రకటనల్లో ప్రచురించడం ఏమిటి? జగన్మోహన్ రెడ్డికి కళ్లు మూసుకున్నా, తెరిచినా తెలంగాణ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో దాచుకున్న తనకు చెందిన వేలకోట్లు గుర్తుకు వస్తున్నట్లున్నాయి'' అని ఎద్దేవా చేశారు.

''వందలకోట్ల ప్రజాధనాన్ని తగలేసి కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తోందా ఏపీకి చెందిన ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంటు? ఇంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించినందుకు సమాచార ప్రసార శాఖామంత్రి పేర్నినానీపై చర్యలు తీసుకోవాలి. ప్రకటనలకు వెచ్చించిన మొత్తం సొమ్ముని ఆయన నుంచే వసూలుచేయాలి. చట్టవిరుద్ధంగా, హైకోర్ట్ తీర్పుకి విరుద్ధంగా మాట్లాడిన మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలి'' అని డిమాండ్ కొమ్మారెడ్డి డిమాండ్ చేశారు.