గుంటూరు: ముఖ్యమంత్రి జగన్ కు ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గారు ఒక సవాల్ విసిరారని...ఆ సవాల్ కు ప్రభుత్వం నుండి గానీ, సీఎంకు గానీ ఎలాంటి సమాధానం రావడంలేదని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. వారి నుంచి కయ్ కుయ్ మనే శబ్దం కూడా లేదని ఎద్దేవా చేశారు. 

 అమరావతి అంశంలో జగన్ ఎలా మాట తప్పాడో, ప్రజలను ఎలా వంచించాడో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన మాటను, అధికారంలోకి రాగానే ఎలా తుంగలో తొక్కాడో టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తెలిపారని పట్టాభిరాం అన్నారు. జగన్ తన నిర్ణయాన్ని అమలు చేయాలనుకుంటే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి వారి ఆమోదం పొందాలని సూచించడం జరిగిందన్నారు. రాజధానిని మూడుముక్కలు చేయడం ఎంతవరకు న్యాయమో సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు జగన్ ను  నిలదీయడం జరిగిందన్నారు. బాధ్యత గల ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ప్రజల పక్షాన సవాల్ చేస్తే ముఖ్యమంత్రి ముఖం చాటేశాడన్నారు.  

మాట్లాడితే మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మాటలు, వాగ్ధానాలు ఏమయ్యాయో చెప్పాలని పట్టాభి డిమాండ్  చేశారు.  ఎన్నికలకు ముందు వైసిపి మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే రాజధానిని మూడు ముక్కలు చేస్తామని ఎక్కడా చెప్పని జగన్, నేడు ఏ కుట్రతో రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నాడో చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. 

జగన్ తో పాటు, ఆయన పార్టీ నేతలైన బొత్స, ధర్మాన, ఉమ్మారెడ్డి, పార్థసారధి, కృష్ణప్రసాద్, పేర్నినాని వంటి వారంతా తమ నాయకుడు ఇక్కడే ఉంటాడు, అమరావతిని పూర్తి చేస్తాడని గతంలో చెప్పారని వారంతా ఇప్పుడేం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. చంద్రబాబు చేసిన ఛాలెంజ్ ను స్వీకరించే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా? అని పట్టాభి ప్రశ్నించారు. 

read more  వారు ఒప్పుకుంటే...ఆ ఇంట్లో సచివాలయం, అక్కడ రాజధాని అయినా ఓకే: వర్ల సంచలనం

తన పరిపాలనపై, తన నిర్ణయంపై జగన్ కు నమ్మకం ఉంటే తక్షణమే ప్రజాక్షేత్రంలోకి రావాలని కొమ్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రజల ఆమోదం జగన్ కు లభిస్తే, టీడీపీ ఎప్పుడూ రాజధాని గురించి మాట్లాడదని... ఎన్నికలకు వెళ్లడానికి జగన్ సిద్ధమేనా అని నిలదీశారు.  జగన్ ఎందుకు అడుగు ముందుకు వేయలేకపోతున్నాడో అర్థమవుతోందని... దళితులపై, గిరిజనులపై దాడిచేసినంత తేలిగ్గా ఆయనకు జనంలోకి వెళ్లే ధైర్యం లేదన్నారు. ఒకవేళ జగన్ జనంలోకి వెళితే ఆయనకు శిరోముండనం తప్పదన్నారు. వరప్రసాద్ కు చేసినట్లుగా తనకు ప్రజలు శిరోముండనం చేస్తారనే భావన ఉండబట్టే జగన్ చంద్రబాబు సవాల్ స్వీకరించకుండా ముఖం చాటేస్తున్నాడన్నారు. 

పులివెందుల పులి ఏ ప్యాలెస్ లో దాక్కుందో, పిల్లిలా ఎందుకు తిరుగుతుందో మంత్రులు బొత్స, అనిల్ కుమార్, పేర్నినాని సమాధానం చెప్పాలన్నారు. నిజంగా వారికి, వారి నాయకుడికి దమ్ము, ధైర్యముంటే ఎందుకు ప్రజల్లోకి రావడం లేదన్నారు. 

గుంటూరు జిల్లాలో గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపారని, ప్రజల్లోకి వెళితే వారు ఓటు అనే ఆయుధంతో ఈ ప్రభుత్వాన్ని తొక్కేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళితే ఎవరు ఎవరిని తొక్కిస్తారో, ఎవరు ఎవరికి శిరోముండనం చేస్తారో తేలుతుందని పట్టాభి తేల్చిచెప్పారు. పిరికి పందల్లా మహిళలపై దాడులు చేయకుండా ధైర్యంగా ప్రభుత్వ పెద్దలంతా ప్రజల్లోకి రావాలన్నారు. 

విజయమ్మ రాసిన నాలో నాతో వైఎస్సార్ పుస్తకంలో పలు చోట్ల రాజశేఖర్ రెడ్డి జగన్ ను రాజకీయంగా తయారుచేశాడని, ఆయన మాటలన్నా, ఆయన చూపిన బాటన్నా జగన్ కు ఎంతో అదని, ఇదని రాయడం జరిగిందన్నారు. పేజీ నెం-53లో జగన్మోహన్ రెడ్డికి రాజకీయాల్లో ఉండాలన్న ఆసక్తిని గమనించి రాజశేఖర్ రెడ్డి చిన్నతనం నుంచే అతన్ని మలిచారని, రాజకీయాల్లో ఉండాలంటే ధైర్యం, నిబ్బరం, కలిగి ఉండాలని, అన్నీ పోగోట్టుకున్నా మాట ఇస్తే దానిపై నిలబడాలని, మనల్ని నమ్ముకున్నవారికి తోడుగా ఉండాలని, మనతో కష్టాలు చెప్పుకునే వారిని ఎప్పుడూ అశ్రద్ధ చేయకూడదని రాయడం జరిగిందన్నారు.  వాస్తవంలో ఏం జరుగుతుందో విజయమ్మ చెప్పాలని, అమరావతి రైతులకు, ప్రజలకు జగన్ ఇచ్చిన మాటేమిటో, ఇప్పుడు ఆయన చేస్తున్నదేమిటో ఆమె చెప్పాలన్నారు. 

225 రోజులకుపైగా కొన్ని వేలమంది మనోవేదనతో మరణిస్తుంటే వారివైపు జగన్ కనీసం తలెత్తయినా చూడలేదని, విజయమ్మ రాసిన మాటలకు ఆమె కుమారుడు ఎలా అర్హుడో సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. పేజీ నెం-59, 60లో జగన్, షర్మిలలు చదివిన మొదటి పుస్తకం వాళ్ల నాన్న అని, మాట నోట్లోంచి వచ్చే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని, మాట ఇచ్చి తప్పితే ప్రాణం పోయినట్లేనని విజయమ్మ రాశారని, ఆమె మాటలకు అర్థాన్నిచ్చే విధంగా తన కుమారుడు ఎందుకు ప్రవర్తించడం లేదో ఆమె సమాధానం చెప్పాలన్నారు. 

తన భర్తైన రాజశేఖర్ రెడ్డి ఏ లోకంలో ఉండి ఎంత క్షోభ పడుతున్నాడో విజయమ్మ ఆలోచించాలన్నారు. ఆమె రాసిన వాక్యాలకు జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం అర్హుడు కాడని, ఆమె తన పుస్తకంలోని వాక్యాలను తక్షణమే తొలగించాలని పట్టాభి డిమాండ్ చేశారు. రాజశేఖర్ రెడ్డిపై విజయమ్మకు ఏమాత్రం గౌరవమున్నా, ఆమె తన పుస్తకంలోని మాటలను తక్షణమే తొలగించాలన్నారు.  మాట నిలబెట్టుకోవడమంటే ఏమిటో జగన్ కు విజయమ్మ చెప్పాలన్నారు. అమరావతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా మాట్లాడి, అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి తన మాటపై నిలబడ్డాడో లేదో ఆయన తల్లే చెప్పాలన్నారు. తన కుమారుడి రాజకీయ ప్రస్థానమే ఓదార్పుతో మొదలైందన్న విజయమ్మ, ఈనాడు ఆ ఓదార్పు ఏమైందో చెప్పాలన్నారు. 

రాష్ట్రప్రజలకు, అమరావతి రైతులకు, దళిత కుటుంబాలకు, శిరోముండనం చేయబడిన కుర్రాడి తల్లికి, ట్రాక్టర్ కింద తొక్కించబడిన గిరిజన మహిళ కుటుంబానికి ఓదార్పు అవసరమో లేదో విజయమ్మ చెప్పాలన్నారు. జగన్ నిజంగా రాయలసీమ బిడ్డ అయితే, ఆయనలో ఒక్కశాతమైనా సీమ పౌరుషం ఉండుంటే ఒక రాయలసీమ బిడ్డయిన చంద్రబాబు విసిరిన సవాల్ పై స్పందించాలన్నారు. పిరికివాడిలా పారిపోకుండా, ముఖం చాటేయకుండా జగన్ అసెంబ్లీని రద్దు చేసి ప్రజల్లోకి వెళ్లాలని డిమాండ్ చేశారు. జగన్ తన నిర్ణయంపై స్పందించేవరకు చంద్రబాబు వదిలిపెట్టడని... పట్టాభి, సీమ పౌరుషం ఉన్న వ్యక్తైతే జగన్ తమ సవాల్ పై స్పందించి తీరాలన్నారు పట్టాభి.