Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కాం : సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకు సంబంధం.. కొల్లు రవీంద్ర

ఢిల్లీ లిక్కర్ స్కాంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధం ఉందని.. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే టీడీపీపై ఆరోపణలు చేస్తున్నారని  టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. 

Kollu Ravindra comments over Delhi Liquor Scam, CM Jagan family
Author
First Published Sep 6, 2022, 9:12 AM IST

అమరావతి : ఢిల్లీ లిక్కర్ కుంభకోణంతో సీఎం జగన్, ఆయన సతీమణి భారతి, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలకు సంబంధముందని.. ప్రపంచం కోడైకూస్తోంది అని.. టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఈ విషయం సీబీఐ విచారణలో బయటపడింది అని తెలిపారు. దీన్ని కప్పిపుచ్చడానికే నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలపై వైసిపి నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మంగళగిరిలోని టిడిపి కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

‘జగన్ రెడ్డి జే బ్రాండ్ మద్యం ఢిల్లీలో ఏరులై పారుతోంది, సీబీఐ పేర్కొన్న ట్రెండెంట్ లైఫ్ సైన్సెస్ అనే సంస్థకు ఆదాన్ డిస్టిలరీస్ ద్వారా రూ. రెండు వేల కోట్లు మళ్లించారు. ఇది జగన్, విజయసాయి రెడ్డిల మరో సూట్కేస్ కంపెనీ. ముందూవెనకా ఆలోచించకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టును వైసీపీ మహిళా నేతలు చదువుతున్నారు. మహిళల గౌరవాన్ని దిగజార్చేలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు దయవల్లే రాజకీయాల్లోకి వచ్చాననే విషయాన్ని ఎమ్మెల్సీ పోతుల సునీత మర్చిపోకూడదు. అసలు ఆడవాళ్లు మాట్లాడాల్సిన భాషేనా అది? హెరిటేజ్ సంస్థను లాభాల బాట పట్టించిన ఘనత భువనేశ్వరి, బ్రాహ్మణిలది. ఎన్టీఆర్ ట్రస్ట్, క్యాన్సర్ ఆస్పత్రుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాంటి వారిని విమర్శించడం సిగ్గుచేటు. రాష్ట్రంలో పనికిమాలిన మద్యం బ్రాండ్లను పెట్టి ఆ బురదను టీడీపీపై వేయాలని చూస్తున్నారు. గ్రామాల్లో సారాను ఏరులై పారిస్తున్నారు అని కొల్లు రవీంద్ర ఆరోపించారు.

నెల్లూరు జిల్లాలో దారుణం: మైనర్ బాలిక గొంతు కోసి యాసిడ్ దాడి, బాలిక పరిస్థితి విషమం

భారతి పాత్రను బయటపెట్టామనే వ్యక్తిగత దూషణలు.. పంచుమర్తి అనురాధ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో భారతి పాత్రను బయటపెట్టామనే అక్కసుతోనే వైసిపి నాయకులు చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు.. అని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ధ్వజమెత్తారు. లిక్కర్ స్కాంను పక్కదారి పట్టించేందుకే నారా భువనేశ్వరి, బ్రాహ్మణీలపై ఆరోపణలు చేస్తున్నారని సోమవారం విలేకరుల సమావేశంలో మండిపడ్డారు.  నిరంతరం ప్రజాసేవలో ఉండే చంద్రబాబు కుటుంబీకుల గురించి అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు మాట్లాడటం దుర్మార్గమే. 

ఆదాన్ డిస్టిలరీ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి బినామీ కంపెనీ కాదా? ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఏ5గా ఉన్న ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ కంపెనీ  జగతి పబ్లికేషన్స్లో రూ. వేల కోట్లు పెట్టుబడి పెట్టింది వాస్తవం కాదా?  ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం వైసీపీ వాళ్లకు లేదు. అందుకే అనవసర ఆరోపణలు చేస్తున్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సిబిఐ త్వరలో చార్జిషీటు వేయడం జగన్,  విజయసాయిరెడ్డిల కుటుంబీకులు నిందితులుగా తేలడం ఖాయం. ఈ వ్యవహారంలో తన వాళ్లను కాపాడుకోవటానికి జగన్ ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లారు... అని పంచుమర్తి అనురాధ పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios