విజయనగరం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ధీమాగా ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి మాత్రం గందరగోళంలో ఉన్నారట. 

ఎన్నికల ముందు వరకు గెలుస్తానని ధీమాగా ఉన్న ఆయన సొంత పార్టీ నేతలు పొడిచిన వెన్నుపోటుకు తన పరిస్థితి ఏమవుతుందోనని గందరగోళానికి గురవుతున్నారట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్రకు పెద్ద దిక్కుగా మారారు వైసీపీ ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి. 

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్నీ తానై వ్యవహరించిన స్వామి వైఎస్ జగన్ మదిలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ స్వామికి మాత్రం ప్రాధాన్యత తగ్గించలేదు జగన్. 

ఎమ్మెల్సీగా, ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా నియమించారు. మాజీమంత్రి బొత్స సత్యనారాయణతో రాజకీయ వైరం ఉన్నప్పటికీ స్వామి సర్దుకుపోతూ వచ్చారు. వైఎస్ జగన్ సైతం ఇద్దరితో మాట్లాడి విజయనగరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవెయ్యాలని ఆదేశించారు. 

విజయనగరం జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు 8 గెలిచి విజయనగరం నియోజకవర్గం ఓడిపోతే సహించేది లేదని వార్నింగ్ సైతం ఇచ్చారు. అప్పటి నుంచి బొత్స, కోలగట్ల వీరభద్రస్వామి కలిసి పనిచేస్తున్నారు. అయితే విజయనగరం జిల్లా ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ తొలి అభ్యర్థిని ప్రకటించారు. 

విజయనగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించారు వైఎస్ జగన్. అనంతరం ఆయన గెలుపుకు సహకరించాలని అందర్నీ కోరారు. అయితే వైఎస్ జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి కావడంతో ఆయన తెగ ఉప్పొంగిపోయారు. అంతేకాదు విజయనగరం జిల్లాకే మెుదటి ప్రాధాన్యత ఇచ్చారంటూ జిల్లా వాసులు సంబరపడ్డారు. 

వైఎస్ జగన్ ప్రకటించినప్పటి నుంచి కోలగట్ల వీరభద్రస్వామి ప్రజల మధ్యే ఉంటూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. కుమార్తె, అల్లుడు,భార్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంతా సహకరిస్తున్నారని భావిస్తున్న తరుణంలో ఎన్నికలకు 12 గంటల ముందు సీన్ రివర్స్ అయిపోయింది. 

బొత్స సత్యనారాయణ వర్గంగా చెప్పుకునే ఇద్దరు కీలక నేతలు ప్లేటు ఫిరాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సహకరించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. 

విజయనగరం అసెంబ్లీ టికెట్ ఆశించిన యువ నేతతోపాటు, మరో కీలక నేత సైతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరపున డబ్బులు పంపిణీ చేశారని ప్రచారం జరుగుతోంది. దీంతో కోలగట్ల వీరభద్రస్వామి గందరగోళానికి గురయ్యారట. 

గతంలో తాను పోటీ చెయ్యనని చెప్పినప్పటికీ వైఎస్ జగన్ ప్రకటించడంతో సరే అనక తప్పలేదని అయినప్పటికీ తనకు నమ్మక ద్రోహం చేశారని వాపోతున్నారట. ఏప్రిల్ 10 వరకు తనదే గెలుపు అని ధీమాలో ఉన్న ఆయన ఇప్పుడు డైలామాలో పడ్డారట. 

ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరన్నట్లు సొంత పార్టీవారే ఇలా చేస్తారని తాను ముందుగా ఊహించలేకపోయానని సన్నిహితుల వద్ద వాపోతున్నారట. నమ్మక ద్రోహం తన విజయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఏం జరుగుతుందో తెలియడం లేదని బోరున విలపిస్తున్నారట. 

ఈ వ్యవహారంపై పార్టీ అధినేత వైఎస్ జగన్ కు సైతం ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ చాలా సీరియస్ అయ్యారని ఎన్నికల ఫలితాల అనంతరం వారిపై చర్యలు తీసుకుంటానని ఆందోళన చెందవద్దని చెప్పుకొచ్చారట. అధికారంలోకి వచ్చేది మనపార్టీయేనని అంతా మంచే జరుగుతుందని కోలగట్ల వీరభద్రస్వామికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారట.