కారులో డెడ్ బాడీ  కేసులో విజయవాడకు చెందిన కోగంటి సత్యం‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కోరాడ విజయ్ కుమార్ ను పోలీసుల ముందు లొంగిపోయాడు.

విజయవాడ: జిక్సిన్ సిలిండర్ల వ్యాపారి కరణం రాహుల్ హత్య కేసులో కోగంటి సత్యం అరెస్టయ్యాడు. ఈ హత్య కేసులో ఏ2 గా కోగంటి సత్యం పేరును చేర్చారు పోలీసులు. ఈ నెల 19వ తేదీన విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో పార్కింగ్ చేసిన కారులో కరణం రాహుల్ అనుమానాస్పదస్థితిలో మరణించాడు.

also read:కారులో డెడ్‌బాడీ కేసు: కోరాడ విజయ్‌కుమార్ విజయవాడ పోలీసులకు లొంగుబాటు

ఈ కారులో దొరికిన ఆధారాలను బట్టి రాహుల్ హత్యకు గురయ్యాడని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కోరాడ విజయ్ కుమార్ ఈ నెల 22న పోలీసులకు లొంగిపోయాడు. సోమవారం నాడు బెంగుళూరులో ఉన్న కోగంటి సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రెండు రోజుల క్రితమే కోగంటి సత్యానికి విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. విచారణకు వస్తానని చెప్పి విచారణకు రాకుండా బెంగుళూరుకు వెళ్లాడు. కోరాడ విజయ్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు బెంగుళూరులో కోగంటి సత్యంను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు.