జగన్ కు ప్రాణహాని జరగొద్దనే కోడికత్తిని రెండుసార్లు స్టెరిలైజ్ చేసి.. భుజం మీద దాడి చేశానని నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
అమరావతి : ప్రజల్లో జగన్ కు సానుభూతి కల్పించడానికే తాను ఆయన మీద దాడి చేశానని కోడి కత్తి కేసులో నిందితుడైన జనపల్లి శ్రీనివాసరావు తెలిపాడు. జగన్ ప్రాణాలకు ఎలాంటి హానే జరగకూడదనే ఉద్దేశంతోనే భుజంపైనే పొడవాలని ముందుగానే నిర్ణయించుకున్నానని తెలిపాడు. తాను ఇలా చేయడం వల్ల.. ప్రజలు సానుభూతితో జగన్ కు ఓట్లేస్తారని.. ఆయన ముఖ్యమంత్రి అవుతారని.. అదే తన ఉద్దేశమని చెప్పుకొచ్చాడు. తాను పొడిచినా జగన్ కు నొప్పి కలగకూడదని కోడి కత్తిని రెండుసార్లు స్టెరిలైజ్ చేశానని చెప్పాడు.
జగన్ మీద దాడి చేయడానికి రెండు మూడు గంటలకు ముందు కూడా.. కోడి కత్తిని వేడి నీటిలో మరిగించి స్టెర్లైజ్ చేశానని చెప్పకొచ్చాడు. తాను దాడికి సిద్ధపడి జగన్ ఉన్న ప్రదేశానికి వెళ్లానని.. దాడి చేయడానికి అంటే కొద్దిసేపటి ముందు అతనితో మాట్లాడనని చెప్పాడు. ‘రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 160 సీట్లు గెలుచుకుంటారన్నా’ అని చెప్పానని.. దానికి ఆయన చిరునవ్వుతో స్పందించారని తెలిపాడు. ఆ తర్వాత తాను కత్తితో పొడిచానని.. ‘పర్వాలేదు అన్న దీంతో ఏం కాదులే’ అని కూడా ఆయనతో చెప్పానని తెలిపాడు. జనపల్లి శ్రీనివాసరావు ఇంకా మాట్లాడుతూ.. మొదటి నుంచి తాను వైయస్ రాజశేఖర్ రెడ్డి అభిమానిని ఆయన చనిపోయాక జగన్ అభిమానిగా మారినట్లుగా తెలిపాడు.
కోడికత్తి కేసు : ఎందుకు సాగదీస్తున్నారో.. ముఖ్యమంత్రి, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారుకే తెలియాలి...
2019 జనవరి 17న ఎన్ఐఏ కి జనపల్లి శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలం లోని విషయాలు ఇది. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ వాంగ్మూలంలో ఇలాంటి సంచలన విషయాలు ఎన్నో ఉన్నాయి. జనపల్లి శ్రీనివాసరావు వాంగ్మూలంలోని ప్రధానాంశాలు ఇలా ఉన్నాయి…
జగన్ పాదయాత్ర మొత్తాన్ని నేను టీవీలో చూసేవాడిని. నవరత్నాల పథకాల హామీలు నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. జగన్ అధికారంలోకి వచ్చి అవి అమలు అయితే రాష్ట్ర ప్రజల తలరాతలు మారుతాయని ఆశించాను. అప్పటికే రాష్ట్ర ప్రజలు టిడిపి పాలనలో అనేక వేధింపులకు గురవుతున్నారు. ఆ బాధల నుండి తప్పించేది జగన్ ఒక్కడే. అదే విషయాన్ని11 పేజీల ఉత్తరంలో జగన్కు రాశాను. ఈ లెటర్ రాయడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది.
ఏపీలో టీడీపీ పాలనలో నిరుద్యోగం, పేదరికం, అవినీతి, ప్రభుత్వ పథకాల అమలులో లోపాలు, ప్రణాళిక లేని అభివృద్ధి, ప్రజా సామాజిక సమస్యలు అనేకం ఉన్నాయి. వాటన్నింటికి పరిష్కారం కావాలని నేను ఆరు నెలల పాటు కష్టపడి 11 పేజీల ఉత్తరం జగన్ కు రాశాను. అయితే, అది జగన్ కు అందినా కూడా చదువుతారు అన్న నమ్మకం లేదు. వారికి అంత సమయం ఉండదు. తమ కందిన ఉత్తరాలను పీఏల చేతుల్లో పెడుతుంటారు. అందుకే ఏదైనా పెద్దది చేసి జగన్ దృష్టిలో పడాలనుకున్నాను. కోడి కత్తితో భుజం మీద పొడిచిన ప్రాణాలకు ప్రమాదం ఉండదు కాబట్టి అలాంటి దాడి చేయాలనుకున్నా.
జగన్ మీద దాడి చేస్తే ఫోకస్ ఎక్కువ అవుతుందని.. ఎక్కువ మందికి చేరుతుందని.. అదే సమయంలో జగన్ కు సానుభూతి లభిస్తుందని ఆశించాను. అందుకే దాడికి చేశాను. విఐపి లాంజ్ లో జగన్ వెయిట్ చేస్తున్నారు. ఆ సమయంలో విమానం వచ్చిందని ఎవరో చెప్పడంతో లేచి నిలబడ్డారు. అదే సమయంలో నేను ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడాను. కోడి కత్తి తీసి భుజంపై పొడిచా... అది చూసిన ఆయన చుట్టూ ఉన్న నాయకులు నన్ను చితకబాదారు. నా నుదురు, ముక్కు మీద రక్తం వచ్చింది.
నన్ను కొట్టొద్దని చెప్పండి అన్నా అని చెప్పడంతో ఆయన వారిని వారించారు. ఆ తర్వాత పోలీసులు నన్ను అదుపులోకి తీసుకొని నాజేబులో ఉన్న 11 పేజీల ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ ఉత్తరంలో చివరగా నేను రాసింది.. ఈ దాడి తర్వాత నాకు ఏదైనా ప్రాణహాని కనక జరిగితే నా అవయవాలు దానం చేయాలని నా తల్లిదండ్రులకు తెలిపాను. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం 2018 అక్టోబర్ 17 మే జగన్ మీద నేను దాడి చేయాలి. ప్రతి వారం కోర్టు విచారణకు జగన్ విశాఖపట్నం విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు వెళ్తారని నాకు తెలుసు. కానీ ఆ వారం ఒకరోజు ముందుగానే వెళ్ళిపోయారు దీంతో.. మరోవారం పాటు ఆగి 2018 అక్టోబర్ 25వ తేదీ మధ్యాహ్నం దాడి చేశాను. ఇలాంటి మరిన్ని అంశాలు ఆయన వాంగ్మూలంలో ఉన్నాయి.
