- Home
- Andhra Pradesh
- కోడికత్తి కేసు : ఎందుకు సాగదీస్తున్నారో.. ముఖ్యమంత్రి, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారుకే తెలియాలి...
కోడికత్తి కేసు : ఎందుకు సాగదీస్తున్నారో.. ముఖ్యమంత్రి, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారుకే తెలియాలి...
కోర్టుకు 20కి.మీ. దూరంలో ఉండికూడా రాలేకపోతున్నారా? అంటూ నిందితుడి తరఫు న్యాయవాది కోర్టులో జగన్ కు అఫిడవిట్ మీద కౌంటర్ దాఖలు చేశారు.

అమరావతి : కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టులో గురువారం కౌంటర్లు దాఖలయ్యాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో మరింత దర్యాప్తును అభ్యర్థిస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిమీద ఈ కౌంటర్లు దాఖలయ్యాయి. నిందితుడు శ్రీనివాసరావు తరఫు న్యాయవాది సలీం, ఎన్ఐఏ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాల్ గౌతమ్ ఈ మేరకు కౌంటర్లు వేశారు. జగన్ తరఫు అడ్వకేట్ ఇంకొల్లు వెంకటేశ్వర్లు ఈ కౌంటర్ల మీద తమ వాదనలు వినిపించేందుకు మరింత సమయం కావాలని కోరారు.
దీనికి ఆమోదం తెలుపుతూ న్యాయాధికారి శ్రీనివాస ఆంజనేయ మూర్తి తదుపరి వాదనల కోసం ఈ నెల 17కి ఈ కేసును వాయిదా వేశారు. నిందితుడు శ్రీనివాసరావు తరపు న్యాయవాది తన కౌంటర్లో.. సీఎం జగన్ మీద ఆరోపణలు చేశారు. కేసు విచారణ సక్రమంగా జరగకుండా ఉండాలని సాగదీసేందుకు బాధితుడైన సీఎం జగన్ ప్రయత్నిస్తున్నట్లుగా.. అందుకే పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోందని ఆరోపించారు.
శ్రీనివాసరావు కౌంటర్ లోని విషయాలు ఇలా ఉన్నాయి..
సీఎం కోర్టుకు రాకుండా తప్పించుకునేందుకే మరింత దర్యాప్తును కోరుతున్నారు. ఈ మేరకే పిటిషన్ దాఖలు చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డికి కేసు విచారణ మీద ఆసక్తి లేదు. కోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలోనే జగన్ ఉంటున్నారు. అయినా ఆయన కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదు. చట్టంపై ఆయనకు ఎలాంటి గౌరవం ఉందో ఇది సూచిస్తుంది. ఎన్ఐఏ ఈ కేసును దర్యాప్తు చేసింది. అభియోగ పత్రం కూడా దాఖలు చేసింది. సాక్షుల విచారణ ప్రారంభమైంది. కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని గాని కేసును మరింత దర్యాప్తు చేయాలని గాని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా న్యాయస్థానం దృష్టికి ఇప్పటివరకు తీసుకురాలేదు.
విశాఖ విమానాశ్రయం అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ఈ కేసులో మొదటి సాక్షిగా ఉన్నారు. ఆయన విచారణలోనూ కొత్త విషయాలు ఏవీ బయటకు రాలేదు. అలాంటి సమయంలో ఇప్పటికే పూర్తయిన దర్యాప్తును పక్కనపెట్టి మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పడం.. దర్యాప్తు చేయాలని కోరడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు. నేర విచారణ ప్రక్రియను ఇలాంటి అభ్యర్థన ద్వారా అగౌరపరచడమే అవుతుంది. అఫిడవిట్లో ముఖ్యమంత్రి మరింత దర్యాప్తు చేయించాలన్న కొత్త సిద్ధాంతాన్ని దాఖలు చేశారు. బాధితుడైన సీఎం వైఎస్ జగన్ కు సాక్షిగా కోర్టుకు హాజర అవ్వాలని ఇప్పటికే సమన్లు జారీ అయిన సంగతి తెలిసిందే.
ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ చట్టాన్ని గౌరవించాలి. కానీ ముఖ్యమంత్రి దీనికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారు తమకు తోచినట్టుగా.. ఎలాంటి సహేతకత లేని కారణాలతో అఫిడవిట్ దాఖలు చేశారు. అందులో విచారణలో వెలుగులోకి రాని కొత్త విషయాలు ఏమీ పేర్కొలేదు. ముఖ్యమంత్రి నేరుగా అఫిడవిట్ దాఖలు చేయడంతో పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఎన్ఐఏను బైపాస్ చేశారు. సీఎంకు, ఆయన ముఖ్య వ్యక్తిగత సలహాదారుకే ఇలా ఎందుకు చేశారనేది తెలియాలి, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నందున.. కోర్టుకు రావడం నామోషిగా అనుకుంటున్నారు. అందుకే కోర్టు విచారణ వీలైనంతగా సాగదీస్తున్నారు.
పిటిషన్లో వీడియో కాన్ఫరెన్స్ తో తన సాక్షాన్ని నమోదు చేయాలని కోరారు. దీన్నిబట్టి విచారణ సాగడం జగన్ కు ఇష్టం లేనట్లు కనిపిస్తోంది. ఈ పిటిషన్ కోర్టు ముందు హాజరు కాకుండా తప్పించుకోవడానికి వేశారు. కోర్టుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా ఆయనకి కోర్టుకు రావడానికి ఇష్టం లేదు. ఇలాంటి చర్యలు చట్టంపై గౌరవాన్ని తగ్గించే విధంగా ఉంటాయి. దీని మీద న్యాయస్థానం ఔదార్యం చూపించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద వ్యక్తి అయినా చట్టం ముందు ఒకటే. దీన్నిబట్టే జగన్మోహన్ రెడ్డి వేసిన పిటిషన్ ను కొట్టేయండి.. అని కోరారు.