సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా విభేదాలు  కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే లోకేష్ పాదయాత్రకు కోడెల శివరామ్ హాజరుకావడం పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది.

సత్తెనపల్లి నియోజకవర్గం టీడీపీలో కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తనయుడు డాక్టర్‌ కోడెల శివరామ్‌.. టీడీపీ అధిష్టానంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి టీడీపీ ఇంచార్జ్‌గా నియమించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తన తండ్రి మరణించినప్పటి నుంచి తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వలేదని డాక్టర్ శివరామ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన తండ్రి ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఇచ్చిన హామీ మేరకు పార్టీ తనను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా నియమించాలని కోరారు. 

దీంతో సత్తెనపల్లి టీడీపీలోని పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి. కోడెల శివరామ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనే చర్చ కూడా సాగింది. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సత్తెనపల్లి నియోజకవర్గంలోని అడుగుపెట్టిన సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. 

శివరామ్‌ సత్తెనపల్లిలో నారా లోకేష్‌ను కలిశారు. సత్తెనపల్లి నియోజకవర్గానికి లోకేష్ పాదయాత్ర చేరుకోగా ఆయనకు మిగిలిన నాయకుల మాదిరిగానే శివరామ్ కూడా స్వాగతం పలికారు. ఈ క్రమంలోనే లోకేష్ కూడా డాక్టర్ శివరామ్‌ను ఆప్యాయంగా పలకరించి, ఆయన వెంట తీసుకెళ్లారు. దీంతో లోకేష్‌తో పాటు శివరామ్ పాదయాత్రలో కలిసి నడిచారు. ఇక, లోకేష్ నడుస్తున్న సమయంలో ఓ వైపు కన్నా లక్ష్మీనారాయణ చేతిని, మరోవైపు శివరామ్ చేతిని పట్టుకుని కొద్దిదూరం పాటు నడిచారు. అయితే లోకేష్ పాదయాత్రకు శివరామ్ హాజరుకావడం పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ తర్వాత జరిగిన లోకేష్ సభకు మాత్రం కోడెల శివరామ్, ఆయన అనుచరులు దూరంగా ఉన్నట్టుగా చెబుతున్నారు. 

అయితే గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న శివరామ్‌‌ను మెప్పించేందుకు ఎలాంటి రాజీ ఫార్ములా వర్క్ అవుట్ కాలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శివరామ్ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి వాగ్దానాలు చేయకుండా పార్టీ విజయానికి కృషి చేయాలని ఆయనకు లోకేష్ సూచించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు లోకేష్‌తో భేటీ అయినప్పటికీ.. నియోజకవర్గంలో స్వతంత్రగా తన పనిని కొనసాగించాలని శివరామ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నియోజకవర్గానికి వస్తున్న లోకేష్‌కు పార్టీ కోసం ప్రాణత్యాగం చేసిన కోడెల శివప్రసాద్ కుమారుడిగా స్వాగతం పలకడం తన బాధ్యత అని పేర్కొంటున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఇతర విషయాలపై పార్టీ అధిష్టానంతో చర్చిస్తానని చెబుతున్నారు.