గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ జన్మలో సీఎం కాలేడని వ్యాఖ్యానించారు. భవిష్యత్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవ్వడం ఖాయమన్నారు. 

వైఎస్ జగన్ కు ఏపీలో అధికారం కావాలి కానీ హైదరాబాద్ మాత్రం వదిలిరారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంపడతాడు, రాజధాని కట్టనీయడని విమర్శించారు. ఎన్నికల కమిషన్ బాగా పనిచేసిందని సర్టిఫికెట్ ఇచ్చిన జగన్ అర్థరాత్రి వరకు ఎన్నికలు జరగడంపై ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. 

పక్క రాష్ట్రం వాహనాలు, డబ్బులు తీసుకుని పెద్దనాయకుడిలా ఎన్నికల్లో పోటీచేశావన్న కోడెల జగన్ వెనుక ఉన్న శక్తులు ఏపీ నాశనాన్ని కోరుకుంటున్నాయని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రవర్తన చూసి వైసీపీలో నేతలు ఎవరూ ఉండరని విమర్శించారు. 

ఇంకా వైసీపీలో నేతలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీలో ఖాళీ లేకేనని తెలిపారు. జీవితకాలంలో జగన్ సీఎం కాలేరంటూ శాపనార్థాలు పెట్టారు. జగన్ ప్రవర్తన మార్చుకోకపోతే భవిష్యత్ లో రాజకీయ నాయకుడిగా కూడా మిగలరంటూ ధ్వజమెత్తారు.  ఏపీలో ఎలాగూ గెలవమని తెలిసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భౌతిక దాడులకు దిగుతోందని స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఎద్దేవా చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

వైసీపీకి-టీడీపీకి పోటీయా, ఆశకు హద్దు ఉండాలి: స్పీకర్ కోడెల శివప్రసాదరావు కామెంట్స్