గుంటూరు: సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి రాంబాబుపై ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోటీనా అంటూ సెటైర్లు వేశారు. కోడెల శివప్రసాద్‌కు అంబటి రాంబాబు పోటీనా అంటూ కోడెల మండిపడ్డారు. 

టీడీపీకి వైసీపీ పోటీయే కాదన్నారు. ఆశపడొచ్చు కానీ దురాశ ఉండకూడదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల చరిత్ర ఏంటో ప్రజలకు తెలుసునన్నారు. జనం ఓట్లేసి గెలిపిస్తే అసెంబ్లీ నుంచి పారిపోయని వాళ్లు వైసీపీ నేతలంటూ మండిపడ్డారు. 

ఎందుకు అసెంబ్లీ నుంచి పారిపోయారో ఓటేసిన వారికి ఎప్పుడైనా సమాధానం చెప్పారా అంటూ నిలదీశారు. తనపై కేసు పెట్టారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంకలు గుద్దుకుంటోందని ఎవరైనా కంప్లైంట్ చేస్తే కేసు పెట్టడం సహజమన్నారు. తనపై చేసిన దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు. 

కేసు విచారణ జరుగుతుందని విచారణలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. భయభ్రాంతులకు గురి చేసి, ఎన్నో ఇబ్బందులు పెట్టినా, ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంగా ఎత్తుగడలేసినా ఓటర్లు చెక్కు చెదరలేదన్నారు. 

ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు తాను జేజేలు పలుకుతున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో టీడీపీ విజయదుందుభి తథ్యమన్నారు. టీడీపీ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుపోతుందన్నారు. రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అని కోరుకునే ప్రతీ ఒక్కరూ జగన్ కు ఓటేయ్యలేదని తెలిపారు. 

ఏపీని టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్ ఎవరి మోచేతి నీళ్లు తాగుతున్నారో ఆంధ్రప్రజలకు తెలుసునన్నారు. ఆంధ్రవాళ్లను కుక్కలని తిట్టిన కేసీఆర్ కు వత్తాసు పలుకుతారా అంటూ విరుచుకుపడ్డారు. 

వైఎస్ జగన్ హైదరాబాద్ వదిలి ఎందుకు అమరావతి రావడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన ప్రధాని నరేంద్రమోదీని ఎలా పొగుడుతారో చెప్పాలని కోడెల ప్రశ్నించారు. తాను అసెంబ్లీ స్పీకర్ గా తాను నిష్పక్షపాతంగా పని చేశానన్నారు.