Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్‌కు రామోజీరావు క్షమాపణ చెప్పాలి.. పట్టాభి ఏమైనా ఆకాశంలో దిగొచ్చాడా?: కొడాలి నాని

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. 

Kodali Nani slams TDP and pattabhi Ram Over Gannavaram Incident
Author
First Published Feb 23, 2023, 4:21 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. పట్టాభి పాత ఫొటోలతో ఈనాడు రామోజీరావు తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. కొడాలి నాని ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీఆర్, వైఎస్సార్ ఉన్నప్పుడు రాసినట్టుగా ఈనాడు పిచ్చి రాతలు రాస్తే ఊరుకునేది లేదని అన్నారు. వైఎస్సార్ సాక్షి పెట్టి.. రామోజీరావు మెడలు వంచి ఇంట్లో కూర్చొబెట్టాడని అన్నారు. చంద్రబాబును  సీఎం చేయడమే రామోజీరావు లక్ష్యమని  విమర్శించారు. తప్పుడు రాతలు రాస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సీఎం జగన్‌కు, రాష్ట్ర ప్రజలకు ఈనాడు రామోజీరావు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన రీతిలో ఖండన ఇవ్వాలని అన్నారు. 

టీడీపీ నేత పట్టాభి ఏమైనా ఆకాశంలో దిగొచ్చాడా? అని ప్రశ్నించారు. పట్టాభి మీడియా ముందుకు వచ్చి చెప్పేవి అబద్దాలు అని విమర్శించారు. పోలీసులు దాడి చేశాడని పట్టాభి కోర్టులో అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పట్టాభిని గన్నవరం ఎవరూ పంపించారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అభ్యర్థులలో 14 మంది వెనకబడిన వర్గాలకు చెందినవారేనని.. వైసీపీ ఎమ్మెల్సీలను ప్రకటిస్తున్న రోజే పట్టాభి గన్నవరానికి ప్లాన్ ప్రకారమే వచ్చాడని ఆరోపించారు. 

వైసీపీ శ్రేణులను రెచ్చగొట్టే విధంగా పట్టాభి మాట్లాడటారని అన్నారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసులపై పట్టాభి దాడి చేశారని ఆరోపించారు. పట్టాభి భుజంపై జెండా కర్ర పట్టుకుని వెళ్లాడని.. సీఐని కొట్టిన కూడా కేసు పెట్టకూడదా? అని ప్రశ్నించారు. పట్టాభిని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రెస్ మీట్ చెబుతారా? అని ప్రశ్నించారు. పట్టాభిని అరెస్ట్ చేసినట్టుగా చంద్రబాబు ఇంటికెళ్లి చెప్పాలా? అంటూ ఫైర్ అయ్యారు. 

పట్టాభి పనికిమాలిన 420 అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలకు ఎక్కడా కూడా గాయాలు  కాలేదని అన్నారు. శాంతి భద్రతలను కాపాడే క్రమంలో సీఐ గాయపడితే.. పోలీసులపై అభాండాలు వేస్తున్నారని విమర్శించారు. పోలీసులు లేకపోతే పట్టాభిని చంపి పక్కన పడేసేవారని అన్నారు. సీఎం జగన్, వైసీపీని తిట్టి.. టీడీపీలో ఎదగాలని పట్టాభి చూస్తున్నారని విమర్శించారు. టీడీపీ ఆఫీసు వద్ద కారును ఎవరో తగలబడితే రాష్ట్రంలో ఏదో అరాచకం జరిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ మీద బురద  జల్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

గన్నవరంలో గాయపడిన టీడీపీ నేత గురుమూర్తిని చంద్రబాబు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చి నేరుగా పట్టాభి ఇంటికెళ్లారని మండిపడ్డారు. చంద్రబాబుకు బీసీల మీద ప్రేమ లేదని విమర్శించారు. రాష్ట్ర సంపదను దోచుకునేందుకు.. చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని దుతచతుష్టయం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో రూ. 40 కోట్లు డీల్ జరిగిందని సీబీఐ చెప్పకముందే  లోకేష్‌కు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. జగన్‌ను అడ్డుకోవాలని గతంలో సోనియా గాంధీ, చంద్రబాబు కేసులు పెట్టించారని ఆరోపించారు. ఈరోజు సీబీఐ జగన్‌ను గ్రిప్‌లో పెట్టుకోవాలని ప్రయత్నిస్తే  కుదరదని అన్నారు. కోర్టులు ఉన్నాయని, చట్టాలు ఉన్నాయని చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios