కోనసీమ పేరు మార్పును వ్యతిరేకిస్తూ అమలాపురంలో జరిగిన అల్లర్లు ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీల కుట్రేనని మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆరోపించారు. 

గుడివాడ: కోనసీమ జిల్లాకు రాజ్యాంగనిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ (BR Ambedkar) పేరు పెట్టడాన్ని వ్యతిరేకించడాన్ని మాజీ మంత్రి కొడాలి నాని (Kodali Nani) తప్పుబట్టారు. అమలాపురంలో అలర్లు (amalapuram violance) సృష్టించి, మంత్రి, ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేసి, పోలీసులను గాయపర్చినా వైసిపి ప్రభుత్వం అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరించింది తప్ప ఎక్కడా హింసకు తావివ్వలేదని అన్నారు. మంత్రి ,ఎమ్మెల్యే ఇళ్లను రక్షించడం కంటే ఎవరినీ గాయపరచకుండా గొడవలు అపేందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుందని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

కృష్ణాజిల్లా గుడివాడ మండలం లింగవరంలో గడపగడపకు మన ప్రభుత్వం (gadapagadapaku mana prabhutvam) కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని, ఎంపీ వల్లభనేని బాలశౌరి, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారికతో పాటు ఇతర వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం, రైతు భరోసా కేంద్రాలను వీరు ప్రారంభించారు.

Video

ఈ సందర్భంగా మాజీ మంత్రి నాని మాట్లాడుతూ కోనసీమ పేరు మార్పును వ్యతిరేకిస్తూ జరిగిన అల్లర్లపై స్పందించారు. అమలాపురంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు ప్రతిపక్ష పార్టీలే కారణమన్నారు. నిక్కర్లు వేసుకునే పిల్లలను రెచ్చగొట్టి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) పబ్భం గడుపుకుంటున్నాడని మండిపడ్డారు. అంబేద్కర్ ను వ్యతిరేకించే వాళ్లకు దేశ బహిష్కరణ విధించాలని, జైళ్లలో పెట్టాలని కొడాలి నాని ప్రభుత్వాలకు సూచించారు. 

ఎవరో రాసిన స్క్రిప్టులు చదువుతూ, రాజ్యాంగంపై కనీస అవగాహన లేని సన్నాసులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే జరుగుతుందంటూ చంద్రబాబు (chandrababu naidu), పవన్ కల్యాణ్ పై మాజీ మంత్రి మండిపడ్డారు. ఏ అవగాహనతో పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని నిలదీసారు. చీకటి ఒప్పందాలు చేసుకున్న నాయకుల నుండి తల్లిదండ్రులు తమ పిల్లలను రక్షించుకోవాలని నాని సూచించారు. 

జనసేన కార్యకర్తలందరూ నిక్కర్లు వేసుకునే బుడ్డోళ్ళని మాజీ మంత్రి నాని ఎద్దేవా చేసారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజల క్షేమమే ముఖ్యం కానీ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లు కాదన్నారు. అమలాపురంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సమయంలో పోలీసులు ఫైరింగ్ ఓపెని చేసివుంటే వెంటనే పరిస్థితి అదుపులోకి వచ్చేదన్నారు... కానీ ప్రజల ప్రాణాలను దృష్టిలో వుంచుకుని అలా చేయలేదన్నారు. ప్రభుత్వం ఆస్తులు, మంత్రి, ఎమ్మెల్యే ఆస్తులు ధ్వంసమైనా... చివరకు పోలీసులే గాయపడ్డా సంయమనం వహించారని... ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించిందని కొడాలి నాని అన్నారు. 

కోనసీమ అల్లర్లలో ఒకవేళ పోలీసులు కాల్పులు జరిపివుంటే చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ శవరాజకీయాలు చేసేవారని నాని అన్నారు. చనిపోయిన వారి పాడెలు మోస్తూ శవ రాజకీయాలతో మరింత వివాదం చేసేవారని మాజీ మంత్రి నాని పేర్కొన్నారు. 

అంబేద్కర్ కేవలం ఒక్కరి వ్యక్తి కాదు... అందరివాడని నాని అన్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన అలాంటి గొప్పవ్యక్తి పేరును ఓ జిల్లాకు పెడుతుంటే అభ్యంతరమేంటని ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే కోనసీమలో కొందరు పనిగట్టుకుని అల్లర్లు సృష్టిస్తున్నారని మాజీ మంత్రి నాని ఆరోపించారు.