Asianet News TeluguAsianet News Telugu

వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం కలిగేది చంద్రబాబుకే: కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా (Vangaveeti Radha) వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం  కలిగిదే చంద్రబాబుకే అంటూ వ్యాఖ్యానించారు.

Kodali Nani Sensational Comments on chandrababu naidu over Vangaveeti Radha allegations
Author
Vijayawada, First Published Jan 4, 2022, 5:21 PM IST

తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని వంగవీటి రాధా (Vangaveeti Radha) వ్యాఖ్యానించడం ఏపీ రాజకీయాల్లో గత కొద్ది రోజులుగా చర్చనీయాశంగా మారిన సంగతి తెలిసిందే. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సమక్షంలో రాధా ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాధా ఇంటికెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంతో చాలా మందిలో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది. అయితే తాజాగా వంగవీటి రాధా రెక్కీ వ్యవహారానికి సంబంధించి మంత్రి కొడాలి నాని (Kodali Nani) సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవీటి రాధాకు ఏదైనా జరిగితే ప్రయోజనం  కలిగిదే చంద్రబాబుకే అంటూ వ్యాఖ్యానించారు. వంగవీటి రాధా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 

‘నా సమక్షంలో రాధా అతడిని హత్య చేయడానికి రెక్కీ జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని నేను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాను. దీంతో ముఖ్యమంత్రి విచారణ చేయాలని, భద్రత కల్పించాలని ఆదేశించారు. రాధా భద్రత కల్పించాలని నన్ను అడగలేదు.. నేనూ కూడా సీఎంను భద్రత కల్పించమని అడగలేదు‌’ అని కొడాలి నాని అన్నారు.

రాధాకు గన్‌మెన్లను తీసుకోవాలని, జాగ్రత్తకు ఉండాలని సూచించినట్టుగా చెప్పారు. భద్రత తీసుకోవాలా..? వద్దా..?, పోలీసులకు సహకరించాలా..? వద్దా..? అన్నది రాధా వ్యక్తిగత విషయం అని అన్నారు. చంద్రబాబు నాయుడు (chandrababu naidu) రాజకీయ వ్యభిచారి అని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. విచారణ జరుగుతుందన్న సమయంలో బాధ్యత గల మంత్రిగా తానేమి మాట్లాడలేనని అన్నారు. 

అసలేం జరిగింది..
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలంలో జరిగిన వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ సందర్భంగా రాధా ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ కార్యక్రమంలో ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రాధా వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత మాట్లాడిన నాని.. వంగవీటి రాధాకు 2+2 గన్‌మెన్లను ఇవ్వాలని, భద్రత కల్పించాలని పోలీసు ఉన్నతాధికారులను సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు. అయితే ప్రభుత్వం కల్పించిన గన్‌మెన్లను వంగవీటి రాధా తిరస్కరించారు. 

మరోవైపు వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత నారా చంద్రబాబు నాయుడు ఫోన్ చేశారు. రెక్కీ నిర్వహించిన వ్యవహారంపై ఆయన ఆరా తీశారు. ఇందుకు సంబంధించి డీజీపీ తమ్ సవాంగ్‌కు చంద్రబాబు లేఖ కూడా రాశారు. ఇక, నేరుగా వంగవీటి రాధా ఇంటికి చేరుకున్న చంద్రబాబు.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీ పరంగా అండంగా ఉంటామని చెప్పారు. ఆ సమయంలో రాధా తల్లి రత్నకుమారి కూడా పక్కనే ఉన్నారు. తర్వాత పులవురు టీడీపీ నేతలు కూడా రాధాను కలిసి.. చర్చలు జరిపారు. 

ఆధారాలు లేవు..
ఇక, రాధా చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టామని, ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని విజయవాడ సీపీ కాంతి రాణా టాటా (kanthi rana tata) చెప్పారు. లోతైన దర్యాప్తు జరిపామని.. రెక్కీపై నిర్దిష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. పోలీసు శాఖపై ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలిపారు. రెక్కీకి సంబంధించి ఎవరి వద్ద సమాచారం ఉన్న తమతో పంచుకోవచ్చని అన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios