వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కో ఆర్డినేటర్లతో  సమీక్ష నిర్వహించారు. అయితే ఈ సమీక్షకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కో ఆర్డినేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. 27 మంది ఎమ్మెల్యేలను పనితీరు మెరుగుపరుచుకోవాలని హెచ్చరించినట్టుగా సమాచారం. రానున్న ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో వైసీపీ విజయం సాధించడమే లక్ష్యంగా.. సీఎం జగన్ గత నాలుగు నెలల్లో పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ కావడం ఇది మూడోసారి. 27 మంది పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం జగన్.. వారి పేర్లను కూడా ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. 

“మీలో కొందరు మెరుగైన ప్రదర్శన చేయాలి. నా పక్షాన నిలిచిన వారందరితోనూ సత్సంబంధాలు పంచుకుంటాను. మీలో ఎవరినీ కోల్పోవడం నాకు ఇష్టం లేదు’’ అని జగన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు సర్వే నిర్వహించి ప్రజల మద్దతు ఉన్న నేతలకే టిక్కెట్లు ఇస్తామని చెప్పారు. అయితే గడప గడపకు కార్యక్రమాన్ని సరైన స్పూర్తితో నిర్వహించని ఎమ్మెల్యేల పేర్లను సీఎం జగన్ ప్రస్తావించారనే వార్తలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. 

ఇదిలా ఉంటే.. ఈ వర్క్‌షాప్‌‌కు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొడాలి నాని, వంశీలు సన్నిహితులనే సంగతి తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయం సాధించిన వంశీ.. ఆ తర్వాత పార్టీకి దూరమయ్యారు. అధికారికంగా వైసీపీ కండువా కప్పుకోక పోయినప్పటికీ.. ఆ పార్టీకి మద్దుతు తెలుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని చూస్తున్నారు. ఇక, ఇటీవల ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించిన వంశీ.. జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. అయితే హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరునే కొనసాగించే అవకాశాన్ని పరిశీలించాలని సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఇక, కొడాలి నాని విషయానికి వస్తే గతంలో టీడీపీలో ఉన్న ఆయన.. చంద్రబాబు విధానాలను వ్యతిరేకించి వైసీపీ పెట్టిన కొద్దిరోజులకే ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. అప్పటి నుంచి టీడీపీ, చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటారు. 2019 వైసీపీ అధికారంలో వచ్చాక.. సీఎం జగన్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. అయితే కొన్ని నెలల కిందట మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో ఆయన పదవి కోల్పోయారు. అయితే కొడాలి నానికి ఎన్టీఆర్ అభిమానిగానే గుర్తింపు ఉంది. గతంలో ఆయనకు జూనియర్ ఎన్టీఆర్‌, దివంగత హరికృష్ణలతో సన్నిహితంగా ఉండేవారు. అయితే హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై కొడాలి నాని ఇప్పటివరకు స్పందించలేదు. ఈ విషయంలో ఆయన వ్యుహాత్మక మౌనం పాటిస్తూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇరువురు ఎమ్మెల్యేలు సీఎం జగన్ నేతృత్వంలో జరిగిన సమీక్షకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. అయితే వారి వ్యక్తిగత కారణాల వల్లనే ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. 

 అయితే ఈ వర్క్‌షాపు సందర్భంగా సీఎం జగన్.. గన్నవరం నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అక్కడ రానున్న ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అక్కడ వంశీని యార్ల‌గ‌డ్డ వెంక‌ట్రావు, దుట్టా రామ‌చంద్ర‌రావు వర్గాలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉంటే.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల విషయానికి వస్తే.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, విజయవాడ తూర్పు నియోజకవర్గపు వైసీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్‌లు.. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమాన్ని బాగా చేస్తున్నారని సీఎం జగన్ అభినందించినట్టుగా తెలుస్తోంది.