అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం కన్నా జగన్ ప్రభుత్వానికే 30వేల కోట్ల రూపాయలు ఆదాయం పెరిగిందని మాజీ మంత్రి, టిడిపి ఎమ్మెల్యే కింజారపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.  2018-19 లో రాష్ట్ర ప్రభుత్వానికి లక్షా 57వేల కోట్ల రూపాయలు రాబడి రాగా 2019-20లో అది లక్షా 89 వేల కోట్లకు పెరిగింది వాస్తవం కాదా? అని ఆయన ముఖ్యమంత్రి జగన్ ను ప్రశ్నించారు. 

అయితే ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.26వేల కోట్లు అప్పుచేసి, రూ.64వేల కోట్లు ఖర్చు చేసి 21 ప్రాజెక్టులు పూర్తిచేసి 32వేల ఎకరాలకు నీరిచ్చిందన్నారు.  8 లక్షల గృహాలను నిర్మించిందని....24వేల కి.మీ రోడ్లు నిర్మించిందన్నారు. అదేవిధంగా పోలవరం 70శాతం పూర్తిచేయడం... అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మించారని అన్నారు. అమరావతిలో ప్రభుత్వానికి 2 లక్షల కోట్ల విలువైన 10వేల ఎకరాలను సమకూర్చి పెట్టిందన్నారు.పేదల సంక్షేమానికి రూ.2 లక్షల కోట్లను ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెట్టిందన్నారు.

కానీ తొలి ఏడాదే జగన్ ప్రభుత్వం రూ.72వేల కోట్లు అప్పు చేసిందని...ఆ డబ్బు ఏమైంది? అని ప్రశ్నించారు. ఈ డబ్బుతో ఏం చేశారో ప్రజలకు చెప్పగలరా? అని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వం రూ.1400 కోట్లు విడుదల చేసి 50 రోజులు గడుస్తున్నా ఆ నిధులను ఇంకా మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు ఎందుకు విడుదల చేయలేదు? అని అడిగారు.  తెలంగాణ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపాలిటీలకు కేంద్రం ఇచ్చిన నిధులను విడుదల చేసినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదు? ఆ డబ్బులు ఏం చేశారు?అని నిలదీశారు. 

''కేంద్రం పంపించే సహాయం అంతా కూడా ప్రజలకు ఎందుకు ఇవ్వడం లేదు? విరాళాలు పెద్దఎత్తున వసూలు చేస్తున్నారు. జగన్ మొదలుకుని జిల్లా ఎమ్మెల్యేల దాకా వసూలు చేస్తున్నారు. ఇదంతా పేద ప్రజలకు ఎందుకు పంచడం లేదు? అటు వైద్య సిబ్బందికి, ఆసుపత్రులకు సౌకర్యాలు కల్పించకుండా, కరోనా వల్ల ఇబ్బంది పడ్డ ప్రజలకు సాయం చేయకుండా.. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలకు నిధులను పంచిపెడుతున్నది వాస్తవం కాదా?'' అని ఆరోపించారు. 

''ప్రజా సంక్షేమం మీద శ్రద్ధ పెట్టకుండా ఇసుక, లిక్కర్, మట్టి, గ్రావెల్, అక్రమ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నది వాస్తవం కాదా? దీనికి గడికోట శ్రీకాంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. బడుగు, బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న జగన్మోహన్ రెడ్డి వారి అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఉద్భవించిన పార్టీ తెలుగుదేశం. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు. 

''కరోనాను అరికట్టడానికి పరీక్షలు ఎక్కువగా చేయాలన్న సూచనలను పెడచెవిన పెట్టారు. రాష్ట్రంలో నేటికి 534 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయంటే అది జగన్ నిర్లక్ష్యమే. క్వారంటైన్ లో సరైన సదుపాయాలు లేవు. డాక్టర్లకు మాస్క్ లు, గ్లౌవ్స్, పీపీఈలు లేవు. ప్రశ్నించిన వారిని సస్పెండ్ చేస్తున్నారు. నిధులు పక్కదారి పడుతున్నాయి'' అని ఆరోపించారు.

''లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమంచి లిక్కర్, మైనింగ్ మాఫియాలు రెచ్చిపోతున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గుంపులు గుంపులుగా వెళుతూ రూ.వెయ్యి సాయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు. ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు. రేషన్ ఇంటింటికీ చేర్చడంలో వైఫల్యం చెందారు. కేంద్రం ఇచ్చిన కందిపప్పుకు బదులు శనగలు ఇవ్వడం దుర్మార్గం'' అంటూ అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.