ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ల కిడ్నాప్ కేసులో దారుణమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నాపర్లు వారితో అత్యంత క్రూరంగా వ్యవహరించిన తీరు తెలుస్తోంది.
విశాఖపట్నం : వైసిపి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్ల కిడ్నాప్ వ్యవహారం గురువారం విశాఖలో కలకలం రేపిన సంగతి తెలిసిందే. కిడ్నాప్ కథ సుఖాంతమైనప్పటికీ.. కిడ్నాపర్లు బాధితులతో వ్యవహరించిన తీరు భయాందోళనలు కలిగించేలా ఉంది. క్రైమ్ వెబ్ సిరీస్ లను తరదన్నే డ్రామా, హింసతో కూడి ఉంది. బాధితులతో అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణా రహితంగా కొట్టారు. కత్తులతో బెదిరించారు. ప్రాణ భయంతో వణికి పోయేలా చేశారు.
బాధితుల మెడలపై కత్తులు పెట్టి.. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడించారు. ఏమాత్రం అనుమానం రాకుండా తాము అనుకున్నట్లుగా వారితో మాట్లాడిస్తూ డ్రామ ఆడారు. విశాఖపట్నం లాంటి నగరం, సాక్షాత్ అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కుటుంబ సభ్యులు, నగరంలో అత్యంత ప్రముఖుడు.. వీరు కిడ్నాప్ గురైన రెండు రోజుల వరకు ఆ విషయం ఎవరికీ తెలియక పోవడానికి ఆ కిడ్నాపర్ల క్రూరత్వమే కారణం.
కిడ్నాప్ ఎలా జరిగిందో.. అత్యంత భద్రత ఉండే ఎంపీ ఇంట్లోకి చొరబడి ఏకంగా మూడు రోజుల వరకు ఎలా తిష్ట వేశారో తెలిస్తే దిగ్భ్రాంతికి గురవ్వాల్సిందే. ఎంపీ కొడుకు ప్రశాంత్.. ఇంట్లోనే ఒక భాగాన్ని తన విశ్రాంతి, ఆహ్లాదం, విడిది కోసం వినియోగించుకుంటాడు. అందుకే అక్కడ సీసీ కెమెరాలు ఉండవు. ఎక్కువ భద్రత సిబ్బంది కూడా ఉండదు. నిర్మానుష్యంగా ఉంటుంది. దీనికి తోడు ఆ చుట్టుపక్కల ఇల్లు లేకపోవడం, రాత్రి అయితే చిమ్మ చీకటిగా ఉండడం.. లోపల ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలిసే పరిస్థితి లేకపోవడం వంటివి కిడ్నాపర్లకు అనుకూలంగా మారాయి.
మొత్తం ఎనిమిది మంది డేగ గ్యాంగ్ కు చెందిన కిడ్నాపర్లు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ముందు వారు ఎంపీ కొడుకుని కిడ్నాప్ చేశారు. అతడు ప్రతిఘటించగా విపరీతంగా కొట్టి, చంపేస్తామని బెదిరించారు. ఆ తర్వాత అతనితోనే తల్లికి ఫోన్ చేయించి అక్కడికి రప్పించారు. ఆమె వచ్చిన తర్వాత ఆమెతో జీవికి ఫోన్ చేయించి రప్పించారు. అలా తమ చేతుల్లో ముగ్గురిని బందీలుగా మార్చారు. ఆడిటర్ జీవి వచ్చిన తర్వాత అతడిని విచక్షణ రహితంగా కొట్టి ఇంటి నుంచి రూ.1.70 కోట్లు అప్పటికప్పుడు డ్రైవర్తో తెప్పించుకున్నారు.
ఎంపీ భార్య దగ్గర ఉన్న నగలన్నీ తీసేసుకున్నారు వీటన్నింటినీ వారి ముగ్గురి ముందే వాటాలు వేసుకున్నారు. ఈ ఎనిమిది మందిలో గ్యాంగ్స్టర్లైనా హేమంత్, గాజువాక రాజేష్ ప్రధాన వాటాదారులు. మిగతా వారికి చిన్న మొత్తాలను ఇచ్చారు. ఈ కిడ్నాప్ లో మరో లవ్ కోణం కూడా వెలుగు చూసింది. ఓ కిడ్నాపర్ తమబంధీలుగా ఉన్న ముగ్గురిలో ఒకరితో తన లవర్ కి రూ.40 లక్షలు ఇవ్వాలంటూ మాట తీసుకున్నాడు. వారిని విడిచి పెట్టిన తర్వాత ఇవ్వాలంటూ హామీ తీసుకున్నాడు. మెడ మీద కత్తి.. తీవ్రమైన భయాందోళనతో వారు దానికి అంగీకరించారు.
తన మాజీ ప్రియురాలికి ఫోన్ చేయించి గ్యాంగ్స్టర్.. అతనితో హామీ కూడా ఇప్పించాడు. అయితే, ఆమె మాత్రం కిడ్నాప్ వల్ల వచ్చే డబ్బులు తనకు అక్కర్లేదని నిరాకరించింది. దీంతో, అచ్చం సినిమాల్లోలాగా ప్రియురాలి కోపానికి కరిగిపోయిన ఆ కిడ్నాపర్.. బాధితులతో తన గతంలో అతనికి డబ్బులు ఇవ్వాల్సి ఉంది అని.. ఆ డబ్బే ఇస్తానని చెప్పించాడు. బాధితులను క్రికెట్ బ్యాట్లతో కొడుతూ.. భయపెడుతూ.. బీభత్సం సృష్టించారు.
గాజువాక రాజేష్ అనే కిడ్నాపర్ పేరు చెబితేనే బాధితులు ముగ్గురు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. రెండున్నర రోజులపాటు ఆ ఇంట్లో తిష్ట వేసి.. మద్యం, గంజాయి తాగుతూ.. బందీలను విపరీతంగా కొడుతూ.. వారు సృష్టించిన బీభత్సం మామూలుది కాదు. ‘మాకు రాష్ట్రమంతా గ్యాంగులు ఉన్నాయి.. కిడ్నాప్ చేసే వారితో పరిచయాలు ఉన్నాయి. . మీరు పోలీసులకు చెప్పినా.. కేసులు పెట్టినా.. ఓ నెల రోజులు జైల్లో ఉండి బయటకు వస్తాం తప్ప మాకు ఏం కాదు. కానీ మేము తలుచుకుంటే మిమ్మల్ని ఏమైనా చేయగలం’ అంటూ హెచ్చరించారు.
పోలీసులకు తెలిసిందన్న అనుమానం వచ్చిన వెంటనే బాధితులను అత్యంత దారుణంగా అక్కడి నుంచి తరలించడానికి ప్రయత్నించారు. ఎంపీ కొడుకు కాళ్లు, చేతులు కట్టేసి కారు డిక్కీలో కుక్కి తరలించారు. ఆడిటర్ జీవిని కూడా అలాగే చేయబోతే.. అలా చేసే తాను చచ్చిపోతానని కారులో కూర్చునేందుకు అవకాశం ఇవ్వాలని బతిమాలుకున్నాడు. దీంతో అతనికి తీవ్రంగా తిడుడూ కారులో ఎక్కించారు.
