న్యూఢిల్లీ: తన ప్లాంట్ ను కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటుందనే వార్తాకథనం లోకసభలోనూ ప్రస్తావనకు వచ్చింది. ఈ అంశాన్ని ప్రస్తావించడానికి ప్రయత్నించిన టీడీపీ పార్లమెంటు సభ్యులను వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు అడ్డుకున్నారు.

కియా మోటార్స్ ప్లాంట్ ఎపీ నుంచి తరలిపోతుందని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రస్తావించగా ఆయనను అడ్డుకునేందుకు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రయత్నించారు. రామ్మోహన్ నాయుడు సీటు వద్దకు కూడా గోరంట్ల మాధవ్ వెళ్లారు. కియా మోటార్స్ ప్లాంట్ ఎక్కడికీ వెళ్లదని, కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని గోరంట్ల మాధవ్ అన్నారు.

Also Read: ఏపీ నుంచి కియా మోటార్స్ తరలింపు వార్తలపై గల్లా జయదేవ్ ట్వీట్

రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలకు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కియా మోటార్స్ ప్లాంట్ తరలిపోతుందనే వార్తల్లో నిజం లేదని మిథున్ రెడ్డి అన్నారు. వైసీపి విధానాల వల్లనే కియా మోటార్స్ ప్లాంట్ పక్క రాష్ట్రానికి వెళ్లిపోతోందని, రాష్ట్రం ఎటు పోతుందో అర్థం కావడం లేదని, పెట్టుబడులు రాష్ట్రానికి రావడం లేదని రామ్మోహన్ నాయుడు అన్నారు. అయితే, కియా మోటార్స్ తో ప్రభుత్వానికి సత్సంబంధాలున్నాయని మిథున్ రెడ్డి చెప్పారు. తాను కియా మోటార్స్ ఎండీతో మాట్లాడానని, కియా మోటార్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడికీ వెళ్లడం లేదని ఆయన అన్నారు.

అంతకు ముందే ట్విట్టర్ వేదికగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆ వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కియా మోటార్స్ వారితో రాష్ట్రప్రభుత్వానికి మంచి సంబంధాలున్నాయని ఆయన చెప్పారు.

Also Read: పరమ చెత్త ఊహాగానాలు: ప్లాంట్ తరలింపు వార్తలపై కియా మోటార్స్

కియా మోటార్స్ తన అనంతపురం జిల్లా ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నిస్తోందంటూ రాయిటర్స్ ఓ వార్తాకథనం ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ వార్తాకథనం ప్రస్తుతం దుమారం రేపుతోంది. ప్రభుత్వం స్పష్టత ఇచ్చినా కూడా ఎపీ సీఎం జగన్ ప్రభుత్వం పై విమర్శలు ఆగడం లేదు. జగన్ ప్రభుత్వంపై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా దానిపై స్పందించారు.