అమరావతి: తాము ఆంధ్రప్రదేశ్ నుంచి ప్లాంట్ ను తరలిస్తున్నట్లు వచ్చిన వార్తాకథనాల్లో నిజం లేదని కియా మోటార్స్ స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుకొండ నుంచి కియా మోటార్స్ తన ప్లాంట్ ను తమిళనాడుకు తరలించడానికి ప్రయత్నిస్తోందని, ఇందుకు సంబంధించిన చర్చలు రహస్యంగా జరుగుతున్నాయని రాయిటర్స్ ఓ వార్తాకథనాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.

ప్లాంట్ ను తరలించే ఆలోచనలేవీ లేవని కియా మోటార్స్ ఇండియా  మార్కెటింగ్ అండ్ సేల్స్ హెడ్ మనోహర్ భట్ ఓ ఆంగ్ల మీడియాతో చెప్పారు ఆంధ్రప్రదేశ్ లో తమ ప్లాంట్ అద్భుతంగా పనిచేస్తున్న సమయంలో ఈ విధమైన వార్తలు రావడం ఆశ్చర్యకరమని ఆయన అన్నారు అవి అత్యంత చెత్త ఊహాగానాలని ఆయన అన్నారు.

Also Read: ఏపి నుంచి కియా మోటార్స్ ఔట్: సంచలనం సృష్టించిన వార్తాకథనం

కియా మోటార్స్ తన ప్లాంట్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలించేందుకు ప్రయత్నిస్తోందని వచ్చిన వార్తలపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు విజయసాయి రెడ్డి కూడా స్పందించారు. ఆ వార్తాకథనంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది.  కియా మోటార్స్ తరలిపోతుందనే వార్తల్లో నిజం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. 

సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం కియాతో మంచి సంబంధాలను కొనసాగిస్తోందని ఆయన చెప్పారు. ఏపీలో వారి కార్యకలాపాల విస్తరణకు తాము పూర్తిగా సహకరిస్తామని ఆయన చెప్పారు