విజయనగరం రైలు ప్రమాదంపై ఖర్గే దిగ్భ్రాంతి.. కేంద్రంపై ఫైర్.. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలకు విజ్ఞప్తి
విజయనగరంలో చోటు చేసుకున్న రైలు ప్రమాదంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని కార్యకర్తలను కోరారు.

ఏపీలోని విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. అలాగే రైలు భద్రతలో విఫలమైందంటూ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని కాంగ్రెస్ కార్యకర్తలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో రైలు పట్టాలు తప్పిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారని, పలువురు గాయపడ్డారని తెలిసి చాలా బాధపడ్డానని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు అన్ని విధాలా సాయం అందించాలని కోరారు.
అనంతరం ఆయన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫైర్ అయ్యారు. బాలాసోర్ రైలు దుర్ఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వం చేసిన భద్రత హామీలన్నీ గాలిలో ఆవిరైపోయినట్లు కనిపిస్తోందని విమర్శించారు. రైళ్లను ఆర్భాటంగా, ప్రచారంతో జెండా ఊపే అదే ఉత్సాహాన్ని రైల్వే భద్రత, కోట్లాది మంది రోజువారీ ప్రయాణీకుల శ్రేయస్సు కోసం కార్యాచరణలో కూడా చూపించాలని ఆయన అన్నారు.
కాగా.. ఈ ఘటనపై ప్రధాని మోడీ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50,000 సహాయం ప్రకటించారు. ‘‘బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయాన్ని అందజేస్తున్నారు. ప్రధాన మంత్రి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంది.
ఇదిలా ఉండగా.. విజయనగరం రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరగా, 100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరికి తీవ్ర గాయాలయ్యాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కాంతకపల్లి- అలమండ మధ్య ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.