ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ... అమరావతిలో కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజధాని ప్రాంతంలో ఏపీ కొత్త సీఎస్ పర్యటించారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతున్న వేళ ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి రికార్డు స్థాయిలో 164 సీట్లు గెలుచుకుంది. ఈ నెల 12న ముఖ్యమంత్రిగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటి పార్కు మేధ టవర్స్ వద్ద సభా స్థలాన్ని సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన భద్రత, ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణలో కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ బిజీబిజీగా ఉన్నారు. ఈ ఏర్పాట్లలోనే రాష్ట్ర అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉంది.
ఇదే సమయంలో రాజధాని అమరావతి ప్రాంతంలో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సుడిగాలి పర్యటన చేశారు. ఈనెల 12 న కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న వేళ ఈ పర్యటనకు ప్రాధాన్యం సంతరించుకుంది. అసంపూర్తి పనులతో మధ్యలో ఆగిపోయిన వివిధ భవన నిర్మాణాలను సీఎస్ పరిశీలించారు. ముందుగా రాజధాని ప్రాంతానికి భూమిపూజ చేసిన ఉద్దండరాయుని పాలెం గ్రామంలోని సీఆర్డీయే ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. అనంతరం అఖిల భారత సర్వీసు అధికారుల నివాసం సముదాయ భవనాలను, ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఏపీ ఎన్జీవోలో నివాస భవనాల సముదాయాలను పరిశీలించారు. అనంతరం హైకోర్టు ప్రాంగణం, ఇతర ప్రాంతాలను సందర్శించారు. సీఎస్ వెంట సీఆర్డీయే కమిషనర్ వివేక్ యాదవ్, ఇతర అధికారులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలు విడిపోయాక.. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసింది. పలు నిర్మాణాలు, ప్రాజెక్టులు చేపట్టిన రాజధాని అభివృద్ధి పనులకు అంకురార్పణ చేసింది. అసెంబ్లీ, హైకోర్టు సహా పలు భవన సముదాయాలను నిర్మించింది. అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఆ తర్వాత 2019లో వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒకే రాజధాని కాకుండా.. ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులని ప్రకటించింది. అమరావతి శాసన రాజధానిగా ఉంటుందని, విశాఖను అర్థిక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేస్తామంది. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో అమరావతి ప్రాంత ప్రజలు, ప్రతిపక్షాలు గడిచిన ఐదేళ్లు అనేక పోరాటాలు చేశాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ముందు నుంచి చెబుతున్నట్లుగానే అమరావతి అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగానే సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ సీఆర్డీయే ప్రాంతంలో పర్యటించారు.