ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల అనంతరం  టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నలకు పెద్దగా పొసగడం లేదుద. ఒకప్పుడు మంచి మిత్రులుగా ఉన్న వీరిద్దరూ... ఆ తర్వాత బద్ధ శత్రువుల వల్లే ప్రవర్తించారు. ఒకరిపై మరొకరు ట్విట్టర్ వేదికగా కూడా విమర్శించుకున్నారు. ఒకే పార్టీ నేతలు ఇలా విమర్శించుకోవడం చూసి అందరూ షాకయ్యారు కూడా. తాజాగా... కేశినేని నాని కారణంగా... బుద్ధా వెంకన్న ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...  కృష్ణా జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ జిల్లా పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో పాటు పలువురు ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. అయితే ఈ సమావేశానికి హాజరైన బుద్దా వెంకన్న కీలక నిర్ణయాన్ని సమావేశంలో వెల్లడించారు. 

విజయవాడ అర్బన్ పార్టీ అధ్యక్షునిగా వచ్చే టర్మ్ నుంచి ఉండబోనని బుద్దా వెంకన్న తేల్చిచెప్పేశారు. భవిష్యత్‌లో ఎవరికి పదవి వచ్చినా తాను అన్ని విధాలా సహకరిస్తానన్న అభిప్రాయాన్ని సమావేశంలో వెల్లడించి బుద్దా అక్కడి నుంచి బయటికి వెళ్లిపోయారు. అయితే ఏడాది తరువాత వేసే కమిటీలకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకని మరో వర్గం చర్చించుకుంటోంది. కాగా.. బుద్దా ఈ ప్రకటన చేసిన అనంతరం అందరూ కేశినేనితో జరిగిన మాటల యుద్ధమే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని చర్చించుకుంటున్నారు.