ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘెర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో పార్టీ కార్యకర్తలు అధైర్యపడే అవకాశం ఉందని పార్టీ నేతలు భావించారు. అందుకే వారిలో ధైర్యం నింపేందుకు పార్టీ సీనియర్ నేతలు అడపా దడపా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాల వారీగా పార్టీ పెద్దలు సమావేశమౌతూ... కార్యకర్తలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇప్పటికే కొన్ని జిల్లాలలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాల్లో టీడీపీ సమన్వయ కమిటీ తాజాగా ఓ సమావేశం నిర్వహించింది. అయితే.. ఈ కీలక సమావేశానికి ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో సహా పలువురు టీడీపీ కీలక నేతలు డుమ్మా కొట్టారు. అయితే జిల్లా నేతలు... అది కూడా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన వారు గైర్హాజరు కావడం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.

కాగా... ఈ సమావేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు జిల్లాలో టీడీపీ క్యాడర్ బలోపేతం చేసేందుకు తీసుకురావాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చిస్తున్నారు. అయితే కృష్ణా జిల్లా టీడీపీ నేతలు సమావేశానికి ఎందుకు గైర్హాజరయ్యారు అన్న విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీ సమావేశానికి రాకపోవడం వెనుక కారణాలేమిటో తెలుసుకునే పనిలోపడ్డారు. కొంపదీసి ఈ ఇద్దరు నేతలు టీడీపీ వీడే ఆలోచనలో ఉన్నారా అనే చర్చ కూడా మొదలైంది. మరి దీనిపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి.