Asianet News TeluguAsianet News Telugu

వైసీపీలోనూ చక్రం తిప్పుతోన్న కేశినేని నాని .. టికెట్ల విషయంలో పంతం నెగ్గించుకున్నారుగా..

తనకు ఎంపీ టికెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు కేశినేని నాని. జగన్‌తో సమావేశమైన తక్షణం ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి వైసీపీ క్యాంప్‌లో చేరిపోయారు. 

keshineni nani power in ysrcp ksp
Author
First Published Jan 20, 2024, 6:21 PM IST

తనకు ఎంపీ టికెట్ కేటాయించకుండా నిర్లక్ష్యం చేసిన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు కేశినేని నాని. జగన్‌తో సమావేశమైన తక్షణం ఎంపీ పదవికి, టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి వైసీపీ క్యాంప్‌లో చేరిపోయారు. ఆ పార్టీలోనూ కేశినేని నాని మాట చెల్లుబాటు అవుతోంది. తనకు విజయవాడ పార్లమెంట్ టికెట్ ఖరారు చేసుకోవడంతో పాటు తన ప్రధాన అనుచరుడైన తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసుకు కూడా సీటును ఇప్పించుకున్నారు నాని. 

స్వామి దాసు తొలి నుంచి కేశినేనికి గట్టి మద్ధతుదారుగా వుండేవారు. తిరువూరులో తన ప్రతినిధిగా దాసుకు బాధ్యతలు అప్పగించారు నాని. వీరిద్దరూ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు. 1994, 1999 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గెలిచిన నలగట్ల స్వామిదాసుకు ఆ తర్వాత మాత్రం టికెట్ లభించలేదు. అయినప్పటికీ ఆయన పార్టీని అంటిపెట్టుకునే వున్నారు. 2014లో మరోసారి తిరువూరు అసెంబ్లీ టికెట్ కేటాయించగా, ఆ ఎన్నికల్లో దాసు ఓడిపోయారు. 2019లో ఆయనను పక్కనబెట్టి మంత్రి కేఎస్ జవహర్‌ను తిరువూరు బరిలో దించారు. 2024లోనైనా తనకు టికెట్ దక్కుతుందని దాసు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 

అయితే ఈసారి కూడా అధిష్టానం ఆయనకు మొండిచేయి చూపింది. దేవదత్‌ను తిరువూరు టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా నియమించారు చంద్రబాబు . ఈ పరిణామాలతో తనకు టికెట్ దక్కదని దాస్ ఫిక్స్ అయ్యారు. తన అనుచరుడికి టికెట్ ఇప్పించుకునేందుకు ఎంపీ కేశినేని నాని సైతం గట్టిగా పట్టుబట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాదు.. నాని అనుచరుడు కావడం వల్లే స్వామిదాసును పక్కనబెట్టారన్న వాదన కూడా లేకపోలేదు. పార్టీలోని పరిస్ధితుల నేపథ్యంలో కేశినేని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరగా.. స్వామిదాసు కూడా గురువు బాటలోనే నడిచారు. 

వైసీపీలో చేరిన వెంటనే తనకు ఎంపీ, అనుచరుడికి అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవడం ద్వారా కేశినేని నాని వైసీపీలోనూ తాను చక్రం తిప్పగలనని సంకేతాలు పంపారు. ఇద్దరు నేతలకు టికెట్లు దొరకడంతో వారి మద్ధతుదారులు , అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే దాసుకు టికెట్ కన్ఫర్మ్ కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యే రక్షణ నిధి వర్గం గుర్రుగా వుంది. ఆయన పార్టీ మారుతారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే తెలుగుదేశంలో చేరినా రక్షణ నిధికి తిరువూరు టికెట్ దక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే దత్తు ఇప్పటికే అక్కడ కర్ఛీఫ్ వేసుకుని కూర్చొన్నారు. మరి ఆయన ఏం చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios