Asianet News TeluguAsianet News Telugu

అగ్రిగోల్డ్ లాగే ఆదుకోండి: జగన్‌పై కేశవరెడ్డి బాధితుల ఒత్తిడి

కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేసిన కేశవరెడ్డి అధిక వడ్డీ చెల్లిస్తామని రూ. 1,500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పిన సంగతి తెలిసిందే. 
 

Keshava Reddy victims seek AgriGold like similar bail out
Author
Nandyal, First Published Jul 21, 2019, 5:16 PM IST

అగ్రిగోల్డ్ బాధితులతో సమానంగా తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ కేశవరెడ్డి బాధితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను ప్రభుత్వం తరపు నుంచి అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి జగన్ సర్కార్ బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేసింది.

దీంతో కేశవరెడ్డి బాధితులు సైతం ఇదే రకమైన సాయాన్ని డిమాండ్ చేస్తున్నారు. కాగా ఈ అంశంపై నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. కేశవరెడ్డి బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. ఎవరైతే కేశవరెడ్డిలో డిపాజిట్ చేశారో వారందరికీ న్యాయం చేస్తామన్నారు.

2017 నంద్యాల ఉప ఎన్నికల సమయంలో ప్రతిపక్షనేతగా ఉన్న జగన్.. పట్టణంలోని ప్రతి వీధిని తిరిగారని... కేశవరెడ్డి బాధితులకు న్యాయం చేస్తామని, ఎవరూ ఆధైర్యపడొద్దని హామీ ఇచ్చారని కానీ ఇంతవరకు ఈ దిశగా చర్యలు చేపట్టలేదంటూ స్థానిక నేత ఒకరు ఎద్దేవా చేశారు.

మొత్తం నంద్యాలకు చెందిన సుమారు 500 మంది డిపాజిటర్లలో ఒక్క నంద్యాలకు చెందిన వారే దాదాపు రూ. 500 కోట్ల వరకు పొగొట్టుకున్నారని ఆయన మండిపడ్డారు. యాలూర్ గ్రామానికి చెందిన 50 మంది డిపాజిటర్లు తమకు న్యాయం చేయాలంటూ కేశవరెడ్డి విద్యాసంస్థల ముందు ధర్నాకు దిగారు.

కేశవరెడ్డి బాధితులతో సమావేశమైన శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డి మాట్లాడుతూ.. బాధితుల జాబితాను తయారు చేయాల్సిందిగా ఇప్పటికే అధికారులను ఆదేశించానని.. అలాగే అసెంబ్లీ దృష్టికి తీసుకొచ్చానని శిల్పా తెలిపారు.

సూర్య నారాయణ రెడ్డి అనే బాధితుడు మాట్లాడుతూ.. మోసానికి సూత్రధారి అయిన కేశవరెడ్డి ఇంకా అనంతపురం జైలులోనే ఉన్నాడని.. ఆయనపై ఇంతవరకు ఛార్జీషీటు దాఖలు కాలేదన్నారు.

ఆయన బెయిల్ సైతం కోరలేదని గుర్తు చేశారు. ఒక ఆర్ధిక నేరస్థుడిని ప్రభుత్వం ఎటువంటి కారణం చూపకుండా ఇంతకాలం జైలులో ఉంచడం విడ్డూరంగా ఉందని ఆయన మండిపడ్డారు.

కడప, ప్రొద్దుటూరు, అనంతపురం, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్ కేంద్రాలుగా పనిచేసిన కేశవరెడ్డి అధిక వడ్డీ చెల్లిస్తామని రూ. 1,500 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios