నిన్న రాత్రి కేరళ రాష్ట్రం కోజికోడ్ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం రన్ వే మీద నుంచి దూసుకెళ్లి కింద లోయలో పడిన దురదృష్టకర సంఘటన లో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘోర సంఘటన నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు తాజాగా పవన్ కళ్యాణ్ సైతం తన సంతాపాన్ని తెలిపారు. 

"కేరళలోని  కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో  ఇరువురు పైలెట్లు, పదిహేడు మంది ప్రయాణికులు దుర్మరణం చెందడం బాధాకరం. ప్రయాణం చివరి నిముషాలలో ఊహించని ఈ ప్రమాదం జరగడం విధి వైపరీత్యం. 

గల్ఫ్ నుంచి ప్రయాణం చేసినవారు మాతృభూమిపై కాలు మోపే లోపలే మృత్యువు ప్రమాదం రూపంలో కాటు వేసింది.ఈ విమానాన్ని నడిపిన వింగ్ కమాండర్ శ్రీ దీపక్ వసంత్ సాథే, కెప్టెన్ శ్రీ అఖిలేష్ కుమార్ లు విమాన యానంలో ఎంతో అనుభవం ఉన్న పైలెట్లు. అయినప్పటికీ ఈ విమానం ప్రమాదానికి గురవడం దురదృష్టకరం. 

ముఖ్యంగా వింగ్ కమాండర్ శ్రీ దీపక్ వసంత్ సాథే గతంలో భారత వాయుసేనలో చిరస్మరణీయ సేవలు అందించారు. వ్యక్తిగతంగా కూడా నాకు ఆయన తెలుసు. ఈ ప్రమాదంలో ఆయన కూడా దుర్మరణం పాలవడం నన్ను తీవ్రంగా కలచివేసింది. 

వాయుసేనలో శ్రీ సాథే అందించిన సేవలు, చూపిన ధైర్య సాహసాలు ఎన్నటికీ మరువలేము. ఈ ప్రమాదంలో అశువులు బాసిన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను" అని పవన్ కళ్యాణ్ ఒక పత్రిక ప్రకటనను విడుదల చేసారు.