అన్న ప్రాసన రోజే అవకాయ: పవన్ కల్యాణ్ పై కేఈ సెటైర్లు

KE satires on Pawan Kalyan claims
Highlights

తాను ముఖ్యమంత్రిని అవుతానని, 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు.

కర్నూలు/ విజయవాడ:  తాను ముఖ్యమంత్రిని అవుతానని, 2019లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి స్పందించారు. సీఎం అవుతానని పవన్ చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే అన్నప్రాసన రోజే ఆవకాయ తింటానని అన్నట్లుందని ఆయన వ్యంగ్యంగా అన్నారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని కేఈ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ధర్మపోరాటంలో విజయం సాధిస్తామని ఆయన అన్నారు. ప్రజలను జిఎస్టీ భూతంలా వెంటాడుతోందని, మోడీ వల్ల దేశం వెలిగిపోవడం లేదని, మంటల్లో చితికిపోతోందని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలావుంటే, కర్ణాటకలో అప్రజాస్వామిక చర్యలకు బీజేపీనే బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ లేనప్పటికీ గాలి జనార్థన్ రెడ్డితో బేరసారాలు జరిపారని ఆయన విమర్శించారు. బేరసారాల టేపుల విషయంలో కేసులు నమోదుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. 

గాలి జనార్థన్ రెడ్డి చర్యలపైనా, బీజేపీ చర్యలపైనా జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ఆయన సోమవారం మీడియా సమావేశంలో ప్రశ్నించారు. కర్ణాటక రాజకీయాలపై ఎందుకు స్పందించడం లేదని పవన్‌ను కూడా అడిగారు. కర్ణాటకలో గాలి జనార్థన్ రెడ్డి, ఏపీలో జగన్.. బీజేపీకి లెఫ్ట్, రైట్ అని యనమల వ్యాఖ్యానించారు.

loader