హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి చెక్ పెట్టే ఉద్దేశంతోనే తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు ఉన్నట్లు అర్థమవుతోంది. ఇందుకుగాను ఆయన పూర్తిగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేస్తారని అంటున్నారు.

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం హైదరాబాదులోని ప్రెస్ క్లబ్ లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ కోసం పనిచేస్తామనే విషయాన్ని ఆయన చెప్పకపోయిన ఆయన మాటలు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా బలంగా ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. 

ఆయన చెప్పిన ఇతర రాజకీయ పార్టీలు ఒకటి వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ కాగా, రెండోది పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన. అయితే, కేసిఆర్ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆయన మిత్రుడు అసదుద్దీన్ ఓవైసీ తాను వైఎస్ జగన్ కు మద్దతు ఇస్తానని చెప్పారు. 

దేశవ్యాప్తంగా అసదుద్దీన్ ఓవైసీతో కలిసి కలిసి వచ్చే శక్తులను కూడగడుతామని కేసిఆర్ చెప్పారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేసీఆర్ జగన్ వైపే నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ గురి ప్రధానంగా కాంగ్రెసుపై ఉన్నట్లు కనిపిస్తోంది. 

తెలంగాణ పోషించిన పాత్రకు, కాంగ్రెసుతో దోస్తీకి చంద్రబాబును వ్యతిరేకించేందుకు కేసీఆర్ సిద్ధపడినట్లు చెప్పవచ్చు. అయితే, పవన్ కల్యాణ్ ను ఎదుర్కుంటారా, కలుపుకుని ముందుకు సాగుతారా అనేది తెలియడం లేదు.  జగన్ పై పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అందుకు తగిన విధంగానే జగన్ కూడా ఆయనపై ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై కూడా జగన్ వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో వారిద్దరికి మధ్య పొత్తు కుదురుతుందా అనేది సందేహమే. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోకసభ స్థానాలు ఉన్నాయి. తెలంగాణలో 17 ఉన్నాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి 42 లోకసభ స్థానాలున్నాయి. తెలంగాణలో 16 స్థానాలు గెలుచుకుంటామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, 16 కాకున్నా 14 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మరో సీటు అసదుద్దీన్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అంటే కనీసం 15 సీట్లు కేసీఆర్ చేతిలో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాలను వైఎస్సార్ కాంగ్రెసు గెలుచుకుంటే కేంద్రంలో నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చునని కేసిఆర్ బహుశా ఆలోచిస్తూ ఉండవచ్చు. 

ప్రస్తుతం కాంగ్రెసుతో బిజెపియేతర కూటమికి చంద్రబాబు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ప్రాంతీయ పార్టీల సమావేశానికి ఎస్పీ, బిఎస్పీ హాజరు కాలేదు. బిఎస్పీ అధినేత మాయావతి కాంగ్రెసుకు దూరంగానే ఉన్నారు. ఇటీవల నాలుగు రాష్ట్రాలకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో బిఎస్పీతో కాంగ్రెసుకు పొత్తు కుదరలేదు. 

అదే సమయంలో కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీ చంద్రబాబును ముందుకు తోసేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెసు అధినేత మమతా బెనర్జీ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, ప్రాంతీయ పార్టీల కూటమి కాంగ్రెసుతో కలిసి పనిచేయాలని మమతా బెనర్జీ వాదిస్తూ వచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకుంటారా అనేది తేలాల్సి ఉంది. 

మొత్తం మీద, కేసీఆర్ ఇతర ప్రాంతీయ పార్టీలను, కొన్ని ఇతర శక్తులను కలుపుకుని జాతీయ రాజకీయాల్లో పనిచేయాలని అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన జగన్ కు సహకరించాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.