ఇబ్బంది తప్పనపుడు తానొకడే కాకుండా తనతో పాటు చంద్రబాబును కూడా ఇబ్బందులోకి లాగేద్దామన్న ఆలోచనే కెసిఆర్లో కనబడుతోంది. మీడియాతో అనేక విషయాలను మాట్లాడిన కెసిఆర్, 2026 వరకూ అసెంబ్లీ సీట్ల పెంపు జరగదని తేల్చేసారని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు విచ్చలవిడిగా ఇద్దరూ ఫిరాయింపులకు పాల్పడిన సంగతి అందరూ చూసిందే. సీట్ల పెంపుపై కెసిఆర్ ప్రధానితో ప్రస్తావించినపుడు కెసిఆర్ ప్రతిపాదనను మోడి తోసిపుచ్చారట.
తెలంగాణా సిఎం కెసిఆర్ ఏపి సిఎం చంద్రబాబునాయుడును ఇరుకునపడేసారు. ఇబ్బంది తప్పనపుడు తానొకడే కాకుండా తనతో పాటు చంద్రబాబును కూడా ఇబ్బందులోకి లాగేద్దామన్న ఆలోచనే కెసిఆర్లో కనబడుతోంది. రాష్ట్రపతి రామ్నాద్ కోవింద్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఢిల్లీకి వెళ్ళిన సంగతి తెలిసిందే కదా? చంద్రబాబు అనేకమంది కేంద్రమంత్రులను కలిసి వచ్చేసారు. అయితే, కెసిఆర్ ప్రధానమంత్రి నరేంద్రమోడిని కూడా కలిసారు. ఆ తర్వాత మీడియాతో కూడా మాట్లాడారు. అక్కడే అసలు సమస్య మొదలైంది.
మీడియాతో అనేక విషయాలను మాట్లాడిన కెసిఆర్, 2026 వరకూ అసెంబ్లీ సీట్ల పెంపు జరగదని తేల్చేసారని చెప్పి పెద్ద బాంబే పేల్చారు. ఎందుకంటే, ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంచాలంటూ కేంద్రప్రభుత్వంపై చాలా కాలంగా కలిసే ఒత్తిడి పెడుతున్నారు. అయితే, వీరి ఒత్తిడికి కేంద్రం ఏ దశలోనూ లొంగలేదనుకోండి అది వేరే సంగతి.
ప్రతిపక్షాలను బలహీన పరిచేందుకు విచ్చలవిడిగా ఇద్దరూ ఫిరాయింపులకు పాల్పడిన సంగతి అందరూ చూసిందే. దాంతో పార్టీలోని సీనియర్లతో సమస్యలొచ్చాయి. వచ్చే ఎన్నికలకు అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరుగుతుందని, కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ ఇంతకాలం నెట్టుకొచ్చారు. సీట్ల సంఖ్య పెరగకపోతే ఇద్దరికీ వచ్చే ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్ధులు చుక్కలు చూపటం ఖాయం. అందుకే సీట్ల పెంపుపై కెసిఆర్ ప్రధానితో ప్రస్తావించినపుడు కెసిఆర్ ప్రతిపాదనను మోడి తోసిపుచ్చారట. అదే విషయాన్ని కెసిఆరే స్వయంగా మీడియాతో వెల్లడించారు.
ఇపుడదే సమస్య చంద్రబాబునూ చుట్టుకుంటోంది. ఎలాగంటే, సీట్ల సంఖ్య పెరగవని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా ఆశావహులు ఎదురు తిరగకుండా, వైసీపీలోకి జంప్ చేయకుండా చంద్రబాబు ఏదోలా నెట్టుకొస్తున్నారు. అయితే, సీట్ల సంఖ్య 2026 వరకూ పెరగని ప్రధానే చెప్పారంటూ స్వయంగా కెసిఆరే చెప్పటంతో చంద్రబాబు ఇరుకున పడినట్లే.
ఎందుకంటే, తెలంగాణాలో సీట్ల సంఖ్య పెరగకపోతే ఏపిలో కూడా పెరగవు కదా? అంటే, ఇంతకాలం చంద్రబాబు దాస్తున్న అసలు విషయాన్ని కెసిఆర్ ఇపుడు బయటపెట్టేసారు. దాంతో ఇక అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని చంద్రబాబు చెప్పే మాటలను నమ్మేవారుండరు. దాంతో ఫిరాయింపు నియోజకవర్గాల్లో కుమ్ములాటలు, తిరుగుబాట్లు మొదలవుతాయి. ఇపుడా సమస్యే చంద్రబాబులో ఆందోళనను పెంచేస్తోంది.
