ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలి : తెలుగు ప్రజలకు కేసీఆర్, జగన్ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ , తెలంగాణ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని వారు ఆకాంక్షించారు .

దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వున్న తెలుగువారికీ ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘ దీపావళి అంటేనే కాంతి-వెలుగు , చీకటిపై వెలుగు , చెడుపై మంచి అజ్ఞానంపై జ్ఞానం, దుష్టశక్తులపై దైవశక్తి .. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే పండుగ అని ముఖ్యమంత్రి అన్నారు.
దీపావళి సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, ప్రజలందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలని, ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారు ఆకాంక్షించారు.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా, చీకటిని పారద్రోలే వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైన ప్రాశస్త్యమున్నదన్నారు. జీవానికి సంకేతమైన అగ్ని కొలువైన దీపాల వెలుగులు మనలో అజ్ఞానాంధకారాన్ని తొలగించి, చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయని చంద్రశేఖర్ రావు తెలిపారు.
ప్రజల సంక్షేమాన్ని కోరి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటాకులు కాలుస్తూ దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపాకటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఉండాలనీ, ప్రతి ఇల్లు సకల శుభాలు, సిరి సంపదలతో విరాజిల్లాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు.

