కావలి టిడిపి ఇంచార్జీగా కావ్య కృష్ణారెడ్డి... ఇంతకూ ఎవరీయన?
అధికార టిడిపి బాటలోనే ప్రతిపక్ష టిడిపి కూడా వెళుతోంది. తాజాగా కావలి నియోజకవర్గ ఇంచార్జీని మార్చి కొత్తవారికి అవకాశం కల్పించింది.
నెల్లూరు : ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే అధికార వైసిపి లోక్ సభ, అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జీల పేరిట అభ్యర్ధుల ఎంపిక, ప్రకటన దాదాపు పూర్తిచేసింది. ఇదే బాటలో ప్రతిపక్ష టిడిపి కూడా ఇంచార్జీల ప్రకటన ప్రారంభించింది. నెల్లూరు జిల్లా కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి దగుమాటి వెంకట కృష్ణారెడ్డి (కావ్య కృష్ణారెడ్డి)ని టిడిపి నియమించింది. ఈ మేరకు ఏపీ టిడిపి అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అధికారిక ప్రకటన చేసారు.
అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కావలి ఇంచార్జీని మార్చినట్లు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్రస్తుత ఇంచార్జీ సుబ్బానాయుడిని తొలగించి కృష్ణారెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. అలాగే కావలి పట్టణ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబను నియమించారు.
ఎవరీ కావ్య కృష్ణారెడ్డి :
సాధారణ కాలేజీ లెక్చరర్ గా ప్రయాణాన్ని ప్రారంభించి ప్రస్తుతం మైనింగ్ కింగ్ గా ఎదిగారు డివి కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి. నెల్లూరు జిల్లాలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి మైనింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించుసుకున్నారు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేసారు. ఇలా అంచెలంచెలుగా వ్యాపారాలను అభివృద్ది చేసుకుంటూ కామర్స్ అధ్యాపకుడు కాస్త వేలకోట్ల అధిపతిగా మారారు.
వ్యాపార రంగంలో తనదైన ముద్ర వేసుకున్న కావ్య కృష్ణారెడ్డి రాజకీయాల్లో చేరారు. చాలారోజులుగా టిడిపిలో కొనసాగుతున్న ఆయన కావలి సీటుపై కన్నేసారు. తాజాగా అనుకున్నది సాధించారు... టిడిపి అదిష్టానాన్ని ఒప్పించి కావలి ఇంచార్జీగా నియమితులయ్యారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేగా మారడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు కావ్య కృష్ణారెడ్డి.