విజయవాడ: విజయవాడలో మరో సారి ఫ్లెక్సీల ఏర్పాటు కలకలం రేపింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు వేయించారు. "పవన్ కళ్యాణ్ గారూ నేను కూయందే తెల్లవారదనుకుందట ఓ అమాయకపు కోడి అలా ఉంది మీరన్నమాట" అంటూ ఫ్లెక్సీ వేదికగా విమర్శించారు.

అంతేకాదు తన కామెంట్లకు తగ్గట్టు సర్దార్ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ కోడిపుంజును పట్టుకున్న ఫోటోను ఫ్లెక్సీలో ఏర్పాటు చేయడం విశేషం. "మీరు మద్దతు ఇవ్వకపోతే చంద్రబాబు 2014లోనే రిటైర్ అయ్యేవారా" అంటూ నిలదీశారు. "ఎందుకీ అహంకారపు ప్రగల్భాలు. 

మీ అన్నదమ్ములంతా కలిసి 2009లో బరిలోకి దిగితే మీకు వచ్చింది కేవలం 18 సీట్లేనని" ఫ్లెక్సీలో విమర్శించారు. ప్రస్తుతం" తలకిందులుగా తపస్సు చేసినా మీరు ఒకటో రెండో సీట్లు గెలిస్తే గొప్ప. అంతకు మించి మీకు సీనూ లేదు..సినిమా లేదంటూ "విమర్శించారు. 

"5కోట్ల ఆంధ్రుల ఆశీస్సులతో మళ్లీ చంద్రబాబే సీఎ అవుతారు ఇది తథ్యం" అంటూ ఫ్లెక్సీ పెట్టారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతోంది. కాట్రగడ్డ బాబుకు ఇలా ఫ్లెక్సీలు పెట్టడం కొత్తేమీ కాదు. దేశంలో లేదా రాష్ట్రంలో ఏదైనా ఘటనలు చోటు చేసుకున్నా, ప్రతిపక్ష పార్టీలను విమర్శించాలన్నా ఆయన ఫ్లెక్సీల వేదికగానే విమర్శించడం ఓ అలవాటు.