ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (Kasireddy Rajendranath Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది.

ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా కసిరెడ్డి వెంకట రాజేంద్రనాథ్ రెడ్డి (KV Rajendranath Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా రాజేంద్రనాథ్‌ రెడ్డికి డీజీపీగా పూర్తి అదనపు బాధ్యతలను ఏపీ సర్కార్ అప్పగించింది. ప్రస్తుతం డీజీపీగా ఉన్న డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం.. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఏపీ నూతన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్న కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి.. 1992 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి. ఆయన గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌గా ఆయన పనిచేశారు. 

ఔషధ నియంత్రణ విభాగం అధికారిగా కూడా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేశారు. హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ ఐజీగా, విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీగా పనిచేశారు. కీలక కేసుల్లో ముఖ్య భూమిక పోషించారు. సర్వీస్‌లో జాతీయస్థాయిలో రాజేంద్రనాథ్‌రెడ్డి గుర్తింపు పొందారు.

ఇక, గౌతమ్ సవాంగ్‌ను బదిలీ చేసిన ఏపీ ప్రభుత్వం.. ఆయనకు ఎక్కడ పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు జీఏడీ‌లో రిపోర్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, 2023 జూలై వరకు సవాంగ్‌కు సర్వీస్ ఉన్నప్పటికీ ప్రభుత్వం బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. గౌతమ్ సవాంగ్ డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాల నుంచి గౌతమ్ సవాంగ్‌పై విమర్శలు వచ్చినప్పటికీ.. సీఎం జగన్ వాటిని పెద్దగా పట్టించుకోలేదు. సీఎం జగన్ ఆదేశాలను గౌతమ్ సవాంగ్ తప్పుకుండా అమలు చేస్తారనే టాక్ కూడా ఉంది. అయితే ఇటీవల ఉద్యోగ సంఘాలు నిర్వహించిన చలో విజయవాడ కార్యక్రమం విజయవంతం కావడం.. లక్షలాది మంది ఉద్యోగులు విజయవాడకు చేరుకుని నిరసన తెలిపారు. పోలీసుల వైఫల్యమే దీనికి కారణమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం.. గౌతమ్ సవాంగ్‌పై వేటు వేసిందనే ప్రచారం జరుగుతుంది.