అనాథ శవాన్ని దట్టమైన అటవీ ప్రాంతంలో రెండు కిలోమీటర్లు మోసుకుంటు వచ్చి దేశవ్యాప్తంగా ప్రముఖులు, సామాన్యుల నుంచి ప్రశంసలు అందుకుంటున్న మహిళా ఎస్ఐ శిరీష ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయారు. సాధారణ కూలీ కూతురు ఈ స్థాయికి రావడం వెనుక వున్న కష్టాన్ని ఆమె మీడియాతో పంచుకున్నారు.

విశాఖపట్నంలోని రామాటాకీస్ ప్రాంతానికి చెందిన శిరీష తల్లిదండ్రులు అప్పారావు, రమణమ్మలు తాపీ పనులు చేసేవారు. ఆమె సోదరుడు సతీశ్ కుమార్ ఇండియన్ నేవీలో, సోదరి దేవి వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నారు. వారి స్పూర్తితోనే పబ్లిక్ సర్వీస్‌ చేయాలని భావించిన శిరీష.. 2014లో ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సంపాదించి మద్దిలపాలెం ఎక్సైజ్ కంట్రోల్ రూమ్‌లో పనిచేశారు. 

ఆ సమయంలో మా ఎస్పీ ఆఫ్‌‌ట్రాల్‌ కానిస్టేబుల్‌వి అని మందలించగానే నిద్ర లేని రాత్రులు గడిపానని.. ఆ మాటతో ఎంతో బాధపడ్డానని శిరీష తెలిపారు. ఐతే ఓ ఎస్పీ ఆఫ్‌ట్రాల్‌ అంటే మరో ఎస్పీ తాను చదువుకుంటానంటే  ప్రోత్సహించారని గుర్తుచేసుకున్నారు.

దీనిలో భాగంగా 8 నెలల పాటు సెలవు పెట్టానను.. జీతం లేకపోయినా ఎస్‌ఐ ఉద్యోగం సంపాదించాలని భావించానని వెల్లడించారు. కానిస్టేబుల్‌గా పనిచేసిన కాలంలో సంపాదించిన రూ.1.50 లక్షలను తీసుకుని ఓ ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్‌లో చేరి పట్టుదలతో చదివి ఎస్‌ఐగా ఎంపికయ్యానని శిరీష తెలిపారు.

అనంతపురంలో ఎస్ఐగా రెండేళ్లు శిక్షణ తీసుకున్నాను. తనను ఆఫ్‌ట్రాల్‌ అన్న ఎస్పీయే విశాఖపట్నం జిల్లా పరిషత్‌లో సన్మానం చేయడం జీవితంలో మధురానుభూతి అని చెప్పారు. 

బరువులు మోయడం.. సేవ చేయడం వంటి వాటిపై ట్రైనింగ్‌లోనూ తర్ఫీదు లభించింది. తమ కులంలో ఆడపిల్ల అంటే పరదా చాటున ఉండాల్సిందేనని.. అందులో నాన్న తనకు 13 ఏళ్లకే పెళ్లి చేశారని శిరీష తెలిపారు. చదువుకోవాలని ఉండేదని.. పుస్తకం కొనేందుకు డబ్బులేదని శిరీష గుర్తుచేసుకున్నారు. 

ఇక పలాస మండలంలో అడవికొత్తూరు ఓ మారుమూల ప్రాంతమని అక్కడికి వాహనాలు వెల్లవని ఆమె చెప్పారు. అనాథ శవం ఉందని చెప్పగా సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నామని శిరీష వెల్లడించారు.

తాను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుని శవం కనిపించిందని చెప్పారు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడం లేదని.. కానీ చివరికి కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్‌ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో స్ట్రెచర్‌ తీసుకురమ్మని చెప్పాను.

స్ట్రెచర్‌పై శవాన్ని వేసేందుకు తనతో వచ్చిన కానిస్టేబుల్‌ ఇష్టపడలేదు. చివరికి తానే స్ట్రెచర్‌పై శవాన్ని ఉంచి మరొకరి సహకారంతో కిలోమీటరు మేర వరి పొలాల గట్లపై శవాన్ని మోశానని శిరీష చెప్పారు. తన దృష్టిలో శివుడైనా... శవమైనా ఒక్కటేనని ఎందుకంటే ఇది నా డ్యూటీ అంటూ శిరీష వెల్లడించారు.