తుంగభద్రపై కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దిగువ రాష్ట్రాలకు(తెలంగాణ, ఏపీ) నదీ ప్రవాహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. 

తుంగభద్రపై కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మించాలని కర్ణాటక ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆందోళనకు కారణమవుతోంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం దిగువ రాష్ట్రాలకు(తెలంగాణ, ఏపీ) నదీ ప్రవాహాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే Upper Bhadra projectకు కేంద్రం నుంచి అనుమతులు పొందిన కర్ణాటక‌లోని బీజేపీ ప్రభుత్వం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొప్పల్ జిల్లాలోని నవలి గ్రామంలో 50 టీఎంసీల సామర్థ్యంతో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను చేపట్టే దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. 

కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్స్ తీర్పులను ఉల్లంఘించి ప్రాజెక్టు రూపకల్పన చేసినప్పటికీ అప్పర్ భద్ర ప్రాజెక్టును కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి రూ. 16,000 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. కర్ణాటకలో బీజేపీకి అధికారంలో ఉన్న నేపథ్యంలో.. ఏపీ, తెలంగాణల అభ్యంతరాలను పక్కనపెట్టి ఎగువ భద్ర ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతినిచ్చిందనే ఆరోపణలు ఉన్నాయి. 

Also Read: ఏపీలోని ఆ ప్రాజెక్టును ఆపండి.. కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ.. తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జలవివాదం

తాజాగా.. తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకుపోయిన నేపథ్యంలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిందని.. ఈ నేపథ్యంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన 230 టీఎంసీలను వాడుకోలేకపోతున్నామని కర్ణాటక అధికారులు చెబుతున్నారు. ‘‘కర్ణాటకకు కేటాయించిన నీటి పరిమాణంలో సిల్ట్ వల్ల ఏర్పడిన లోటును అధిగమించేలా..తుంగభద్ర నీటిని నిల్వ చేయడానికి నవాలి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను చేపట్టాలనుకుంటున్నాం. ఇది కొత్తది కాదు.. కర్ణాటకకు చిరకాల స్వప్నం’’ అని కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి గోవింద్ కజ్రోల్ ఇటీవల మీడియా సమావేశంలో చెప్పారు. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను తుంగభద్ర బోర్డు ముందుంచింది.

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. స్థానిక రైతులను ప్రసన్నం చేసుకునేందుకు నవలీ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ముందుకు వెళ్లే అవకాశం ఉందని తెలుగు రాష్ట్రాల్లోని రైతులు, అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనుమతులు కోరుతూ కర్ణాటక ప్రభుత్వం తుంగభద్ర బోర్డు ముందు నవలీ ప్రాజెక్టు ప్రతిపాదనను ఉంచింది. కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తుంగభద్ర డ్యామ్‌లో నిల్వ నష్టాన్ని పూడ్చగలదని కర్ణాటక బోర్డుకు తెలిపింది. గత కొన్ని దశాబ్దాలుగా ఏర్పడిన పూడిక కారణంగా తుంగభద్ర డ్యాం ఇప్పటికే దాదాపు 31 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయిందని పేర్కొంది. కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కనీసం 50 టీఎంసీలను ఆదా చేయడంలో సహాయపడుతుంది.. మూడు రాష్ట్రాల్లోని కరువు పీడిత ప్రాంతాలకు సహాయం చేస్తుందని చెప్పుకొచ్చింది.

అయితే తుంగభద్ర బోర్డులో ఏపీ, తెలంగాణలకు చెందిన ఇరిగేషన్ అధికారులు కూడా ఉన్నందున.. వారు కర్ణాటక నిర్మించ తలపెట్టిన ఈ ప్రజెక్టుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తమ రాష్ట్రాల్లోని ప్రాజెక్టులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. నవాలీ వద్ద కొత్త బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను చేపట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిపాదనను అంగీకరించేది లేదని ఏపీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సీ నారాయణరెడ్డి తెలిపారు. నిల్వ నష్టాలను పూడ్చేందుకు సమాంతర కాలువలను చేపట్టడం సరైన పరిష్కారమని ఆయన సూచించారు. సమాంతర కాలువతో ఏపీతోపాటు కర్ణాటక, తెలంగాణకూ ప్రయోజనం ఉంటుందన్నారు.