తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని  తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రచిస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్  Krishna River Management Boardకు లేఖ రాశారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరిన్ని ప్రణాళికలు రచిస్తోందని తెలంగాణ సర్కార్ ఆరోపించింది. కృష్ణా నుంచి అక్రమంగా నీటిని తరలించడమే ఏపీ లక్ష్యంగా పెట్టుకుందని మండిపడింది. జల విద్యుత్ ఉత్పత్తి కోసం కృష్ణా బేసిన్‌కు చెందిన నీటిని వెలుపల ప్రాంతానికి తరలిస్తుందని ఆరోపించింది. అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి లేకుండా కర్నూలు జిల్లా పిన్నాపురంలో పంప్డ్‌ స్టోరేజీ స్కీమ్‌ కింద నిర్మించ తలపెట్టిన పునరుత్పాదక విద్యుత్‌ కేంద్రం పనులపై ఏపీ ముందకెళ్తోందని.. వాటిని అడ్డుకోవాలని తెలంగాణ కోరింది.

ఈ మేరకు తెలంగాణ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ Krishna River Management Boardకు మే 28న లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌-84, 85 ప్రకారం విరుద్ధమని అన్నారు. ఏ ప్రాజెక్టు చేపట్టాలన్నా విధిగా అపెక్స్‌ కౌన్సిల్‌ అనుమతి అవసరమని పేర్కొన్నారు. ఈ నెల 17న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శంకుస్థాపన చేశారని ప్రస్తావించారు. కృష్ణా బేసిన్‌లో నీటి లభ్యత అంతంత మాత్రంగానే ఉంటుందని.. ఈ బేసిన్‌ నుంచి ఇతర బేసిన్‌లోకి నీటిని తరలించడం సరైన విధానం కాదన్నారు.

అయితే వారం రోజుల వ్యవధిలోనే ఆయన ఈ విధమైన లేఖ రాయడం ఇది రెండోసారి. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ ప్రాజెక్టు ద్వారా నీటిని తీసుకునేందుకు ఏపీ చేస్తున్న ప్రణాళికలు అక్రమమని తెలంగాణ చాలా కాలంగా చెబుతోంది. పిన్నాపురం పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టు ద్వారా జలవిద్యుత్‌ ఉత్పత్తి చేసేందుకు.. శ్రీశైలం కుడికాలువపై ఉన్న గోరకల్లు రిజర్వాయర్‌ ద్వారా పోతిరెడ్డిపాడు మీదుగా నీటిని తరలించేలా ఏపీ ప్రణాళికలు రూపొందిస్తుందని మురళీధర్ ఫిర్యాదు చేశారు. 

మే 21న రాసిన లేఖ ద్వారా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు వెళ్లకుండా ఏపీని అడ్డుకోవాలని తెలంగాణ బోర్డును కోరిందని తాజా లేఖలో మురళీధర్ గుర్తుచేశారు. “కానీ, KRMB ఇప్పటివరకు ఈ విషయంలో ఎటువంటి చర్యను ప్రారంభించలేదు” అని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని పంప్‌డ్ స్టోరేజీ పథకాల వివరాలను పొంది వాటిని తెలంగాణకు అందించాలని ఆయన KRMBని కోరారు.