విజయవాడ: అమరావతిలోనే ఏపీ రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి రైతులు చేపట్టిన ఆందోళనకు కర్ణాటక రైతులు సంఘీభావం ప్రకటించారు. సంఘీభావం తెలపడానికి వచ్చిన కర్ణాటక రైతులను పోలీసులు అరెస్టు చేశారు. ధర్నా చౌక్ నుంచి మందడం బయలుదేరిన కర్ణాటక రైతులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని కృష్ణలంక పోలీసు స్టేషన్ కు తరలించారు.

కర్ణాటక రైతుల అరెస్టును తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. కర్ణాటక రైతులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారిని ఎలా విడుదల చేయరో చూస్తానని ఆయన అన్నారు. వారిని విడుదల చేయకపోతే తానే వస్తానని ఆయన హెచ్చరించారు. అమరావతి రైతులకు కర్ణాటక రైతులు మద్దతు ఇస్తే తప్పా అని ఆయన ప్రశ్నించారు. 

See Video: 41 వ రోజుకు మహాధర్నా : రైతులకు వంగవీటి రాధ మద్దతు

అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ఆధ్వర్యంలో  ధర్నా చౌక్ ధర్నా చేపట్టారు. కర్ణాటక రైతులు ధర్నాకు  సంఘీభావం  తెలిపారు. కర్ణాటక ప్రాంతంలోని బళ్లారి, సింధనూరు, రాయచూరు, మాండ్యా  రైతులు వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు. మూడు రాజధానులు వద్దు అమరావతి ముద్దు అంటూ నినాదాలు చేశారు. 

రాజధాని ప్రాంత రైతులకు తాము మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక రైతులు తెలిపారు. ప్రభుత్వం రైతుల సమస్యలు తెలుసుకొని ముందుకు సాగాలని వారన్నారు. మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని విమర్శించారు. రాజధాని అమరావతి పరిరక్షణకు అందరూ కలిసి రావాలని కోరారు. 

రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అడ్డుకోవడం దారుణమని వారన్నారు. అమరావతి రాజధాని 5 కోట్ల ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిందని అన్నారు. రాజదానిపై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు  పోరాటం ఆగదని చెప్పారు.

కాగా, రాజధానిలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలు 41 వరోజుకు చేరుకున్నాయి.  తుళ్ళూరు, మందడం గ్రామాల్లో మహాధర్నాలు కొనసాగుతున్నాయి. వెలగపూడిలో 41 వరోజు రిలే నిరాహారదీక్షలు జరుగుతున్నాయి. తుళ్ళూరు మహాధర్నాలో పాల్గొని మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ రైతులకు సంఘీభావం తెలిపారు.