బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెసు నేత సిద్ధరామయ్య ప్రశంసలతో ముంచెత్తారు. డాక్టర్స్ డే సందర్భంగా జులై 1వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ జగన్ వేయికి వైగా 108, 104 అంబులెన్స్ లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దానిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రశంసల జల్లు కురిపించారు. 

వైఎస్ జగన్ ను సిద్ధరామయ్య ప్రశంసిస్తూ కర్ణాటకలో బిజెపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.200 కోట్ల ఖర్చుతో వేయికి పైగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నారని, తమ రాష్ట్రంలో అంబులెన్సులు లేక ప్రజలు రోడ్లపై చనిపోతున్నారని, జగన్ ను చూసైనా తమ ప్రభుత్వం నేర్చుకోవాలని ఆయన అన్ారు. 

జగన్ ప్రవేశపెట్టిన అంబులెన్స్ ల్లో 676 104 వాహనాలు కాగా, 412 108 వాహనాలు. ఆ వాహనాలు విజయవాడ నుంచి జులై 1వ తేదీన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు తరలిపోయాయి. 

జగన్ ప్రవేశపెట్టిన వాహనాల్లో 282 బేసిక్ లైఫ్ సపోర్టుకు చెందినవి. 104 అడ్వాన్స్ లైఫ్ సపోర్టుతో కూడినవి. మరో 26 అంబులెన్సులు చిన్నారులకు (నియో నేటల్) వైద్య సేవలు అందిస్తాయి. 104 వాహనాల సర్వీసుల్లో జగన్ ప్రభుత్వం సమూలమైన మార్పులు చేసింది. హెల్త్ కేర్ డెలివరీకి ఇందులో అవకాశం ఉంటుంది. ఆ స్థాయిలో మొబైల్ మెడికల్ యూనిట్లను తీర్చిదిద్దారు. 

దాదాపు 203.47 కోట్ల వ్యయంతో జగన్ ప్రభుత్వం అంబులెన్స్ వాహనాలను కొనుగోలుచ ేసింది. ప్రతి మండలంలో ఎక్కడ ప్రమాదం జరిగినా, ఎక్కడ అత్యవసర సేవలు అవసరమైనా 20 నిమిషాల్లో చేరే విధంగా ర్యూట్ మ్యాప్ సిద్ధం చేశారు. 

పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లోగా, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లోగా, గిరిజన ప్రాంతాల్లో 25 నిమిషాల్లోగా ఆ వాహనాలు చేరే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి అంబులెన్స్ ను ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ కు అనుసంధానం చేశారు. దానివల్ల వేగంగా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.