Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక సంక్షోభం: రెబల్ ఎమ్మెల్యేల స్టెప్ ఏంటీ..?

కర్ణాటక రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మొదలైన రాజకీయ సెగ.. రోజు రోజుకు ఉత్కంఠకు గురిచేస్తోంది

karnataka crisis: rebel mlas moved from mumbai to goa
Author
Bangalore, First Published Jul 9, 2019, 10:56 AM IST

కర్ణాటక రాజకీయ సంక్షోభం అనేక మలుపులు తిరుగుతోంది. 14 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో మొదలైన రాజకీయ సెగ.. రోజు రోజుకు ఉత్కంఠకు గురిచేస్తోంది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు కాంగ్రెస్, జేడీఎస్ మంత్రులు ఏకంగా తమ పదవులను సైతం వదులుకున్నారు.

ఇప్పటి వరకు రహస్యంగా ఉన్న స్పీకర్ మంగళవారం తెరపైకి రానున్నారు. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలను వ్యక్తిగతం కలిసి చర్చించే అవకాశం ఉండటంతో అసమ్మతి ఎమ్మెల్యేలు ఎలాంటి స్టెప్ వేయబోతున్నారా అని ఉత్కంఠ నెలకొంది.

రెబల్ ఎమ్మెల్యేలు ముంబై నుంచి గోవాకు తమ మకాం మార్చనున్నారు. నిన్న సాయంత్రం ముంబై హోటల్‌ను ఖాళీ చేసిన రెబల్ ఎమ్మెల్యేలు పుణె వెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో మంగళవారం గోవా వెళ్లనున్నారు.

ఓ రిసార్ట్‌లో ఎమ్మెల్యేలంతా బస చేసేందుకు గోవాకు చెందిన బీజేపీ నేత అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై కర్ణాటక బీజేపీ నేతలు భేటీ అయ్యారు. పార్టీ సీనియర్ నేతలు మురుగేశ్ నిరాని, ఉమేశ్ కట్టి, జేసీ మధుస్వామి, రత్నప్రభ తదితరులు యడ్యూరప్ప నివాసానికి చేరుకుని మంతనాలు జరుపుతున్నారు.

బలనిరూపణతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా..? లేదా మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలా అన్న దానిపై యడ్డీ వ్యూహాలు రచిస్తున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ సభ్యుల రాజీనామాల అనంతరం కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 211కు చేరింది.

దీని ప్రకారం ప్రభుత్వానికి ఉండాల్సిన మేజిక్ ఫిగర్ 106.. ఒకవేళ స్పీకర్ రాజీనామాలను పరిగణనలోనికి తీసుకుంటే కాంగ్రెస్‌కు 68, జేడీఎస్‌కు 34 మంది సభ్యులు మాత్రమే ఉంటారు.

ఇదే సమయంలో బీజేపీకి 105 మంది సభ్యుల బలం ఉండగా.. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్ధులు సైతం తమ మద్ధతును బీజేపీకి ప్రకటించారు. ఒకవేళ రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తే బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.  వీటిలో ఏం జరగాలన్నా రాజీనామాలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios