కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజయవాడ వచ్చిన అసలు కారణం తెలిసిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో రాజకీయ కార్యక్రమం కోసం వచ్చారని.. కాదు కాదు ఇంద్రకీలాద్రిపై కొలువైయున్న కనక దుర్గమ్మను దర్శించుకోవడానికి వచ్చారని ప్రచారం జరిగింది.

కానీ అసలు కారణం.. కుమారుడి పెళ్ళిచూపులు. కుమారస్వామి తనయుడు నిఖిల్ పెళ్లి చూపుల కోసమే కర్ణాటక సీఎం బెజవాడ వచ్చినట్లుగా తెలుస్తోంది. నగరానికి చెందిన ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత బొడేపూడి శివకోటేశ్వరరావు కుమార్తె‌తో నిఖిల్‌కు పెళ్లి చేయాలని ఇరు కుటుంబాలు భావిస్తున్నాయి. దీనిలో భాగంగా ఇవాళ పెళ్లిచూపులు ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో అమ్మాయిని చూడటానికి కుమారస్వామి దంపతులు విజయవాడలోని కోటేశ్వరరావు నివాసానికి వెళ్లినట్లుగా సమాచారం. వీరి వెంట మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఉన్నారు. కాగా, నిఖిల్‌, ప్రాఫిట్ షూ కంపెనీ అధినేత కుమార్తె రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారని.. వీరిద్దరికి బెంగళూరులో పరిచయం ఏర్పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరి పరిచయం గురించి కానీ.. పెళ్ళిచూపుల వ్యవహారంపై ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.