గొట్టిపాటిని కొట్టబోయిన కరణం

గొట్టిపాటిని కొట్టబోయిన కరణం

ప్రకాశం జిల్లా టిడిపి నేతలలైన కరణం-గొట్టిపాటి మధ్య వివాదాలు మరోసారి ఉద్రిక్తతకు దారితీసాయి. ఇంతకాలం వర్గాల మద్య మాత్రమే నేరుగా దాడులు జరిగేవి. అటువంటివి ఇద్దరు అగ్రనేత మధ్యే గొడవలు మొదలయ్యాయి. వీరిద్దరి మధ్య గొడవలు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  గురువారం వెలగపూడి సచివాలయం సాక్షిగా జరిగిన ఘటనతో జిల్లాలోని ప్రజాప్రతినిధులు భయపడిపోయారు. కరణం మొదటినుండి టిడిపిలోనే ఉండగా గొట్టిపాటి  కాంగ్రెస్ లో ఉండేవారు. ఇద్దరు చెరో పార్టీలో ఉండేవారు కాబట్టి పార్టీలో అంతర్గతంగా ఎవరికీ ఇబ్బందులుండేవి కావు.

అయితే, చంద్రబాబు చేసిన పని వల్ల గొట్టిపాటి టిడిపిలోకి ఫిరాయించారు. అక్కడి నుండి ప్రత్యర్ధులిద్దరూ ఒకేపార్టీలో ఉండటంతో దాని ప్రభావం జిల్లా పార్టీపై పడింది. ఎప్పుడూ రెండు వర్గాలు ఒకదానిపై మరొకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇటువంటి నేపధ్యంలోనే గురువారం సాయంత్రం జిల్లా సమన్వయ కమిటి సమావేశం పేరుతో జిల్లా నేతలందరూ ఒకచోట చేరారు. జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటిల నియామకం అంశం గొడవకు కేంద్ర బిందువైంది. పర్చూరు ఎంఎల్ఏ ఏలూరి సాంబశివరావు మార్టూరు కమిటి వ్యవహారాన్ని లేవనెత్తారు. అయితే, ఈ కమిటికి ఒక్క పర్చూరే కాకుండా అద్దంకి నియోజకవర్గంతో కూడా సంబంధముంది. కాబట్టి మార్కెట్ కమిటి అధ్యక్షుడిని నియమించే అవకాశం తనకు ఇవ్వాలని ఏలూరు కోరారు.

అయితే, కరణం, గొట్టిపాటి ఇద్దరిదీ అద్దంకి నియోజకవర్గమే. దాంతో కరణం జోక్యం చేసుకుని మాట్లాడుతూ ‘వేసుకోండి.. మీరే వేసుకోండి. ఎక్కడి నుండో వచ్చిన వారు పెత్తనం చేయాలని చూస్తున్నారు’ అంటూ విరుచుకుపడ్డారు. దాంతో వెనకెక్కడో కూర్చున్న గొట్టిపాటి కమిటీతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. గొట్టిపాటి జోక్యాన్ని సహించలేని కరణం వెంటనే గొట్టిపాటిపై తిట్లదండకం మొదటుపెట్టారు. గొట్టిపాటి కూడా అదే స్ధాయిలో రియాక్ట్ అయ్యారు. దాంతో కరణం తాను కుర్చున్న కుర్చినీ ఎత్తుకుని గొట్టిపాటి వైపు దూకారు. దాంతో గొట్టిపాటి కూడా ఇంకో కుర్చి ఎత్తి కరణంవైపు దూసుకొచ్చారు.

హటాత్తుగా మొదలైన పరిణామంతో మిగిలిన నేతలు ఒక్కసారిగా బిత్తరపోయారు. జరుగుతున్న విషయాన్ని గమనించి వెంటనే ఇద్దరిని అడ్డుకున్నారు. అయితే, ఇద్దరూ చాలాసేపు వెనక్కు తగ్గలేదు. దాంతో మంత్రి ఛాంబర్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తర్వాతెప్పుడో శాంతించినా ఎప్పుడేం జరుగుతుందో అర్ధం కాక జిల్లా నేతలు తలలుపట్టుకుంటున్నారు.  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page