కాపుల ఉద్యమం మళ్ళీ ఊపందుకుంటోందా? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న కాపు రిజర్వేషన్ల ఉద్యమంపై మళ్ళీ కాపు నేతలు క్రియాశీలకమవుతున్నారు. కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ళ సుబ్రమణ్యం తాజాగా చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే త్వరలో మళ్ళీ ఉద్యమంటూ ఆందోళనలు మొదలయ్యే సూచనలే కనపిస్తున్నాయి.

శనివారం మీడియాతో మాట్లాడుతూ, కాపులలో వెనుకబాటుతనాన్ని గుర్తించి ఇచ్చిన రిజర్వేషన్ అమలు చేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ చంద్రబాబునాయుడును హెచ్చరించారు. కాపుల్లో వెనుకబాటుతనాన్ని గుర్తించారు కాబట్టి రిజర్వేషన్ అమలు బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకోవాలంటూ చంద్రబాబుకు చెప్పటం గమనార్హం.

కాపులకు 5 శాతం రిజర్వేషన్లు పై డి ఒ పి టి అభ్యంతరం వ్యక్తం చేయడమంటే కాపులకు అన్యాయం చేసినట్లే అన్నారు. కేంద్రం తిరస్కరించిన తర్వాత కూడా కాపులకు రిజర్వేషన్లు వస్తాయని మంత్రులు ఇంకా నమ్మబలకటం  శోచనీయమని మండిపడ్డారు. ఈ నెల 19 న భోపాల్ లో కాపు జాతీయ సమావేశం జరగనుందన్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, గుజరాత్ నుండి హార్దిక్ పటేల్ తో పాటు పలువురు కాపు నాయకులు ఈ సమావేశంలో పాల్గొని భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తారని చెప్పారు.

జులై 10న విజయవాడలో జాతీయ మహాసభ జరుగుతుందన్నారు. కాపుల కోసం ఏర్పాటు చేసిన కాపుకార్పొరేషన్ ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించాలన్నారు. కాపుల కోసం పనిచేసే నిజాయితీపరులకే కార్పొరేషన్ బాధ్యత అప్పగించాలని సుబ్రమణ్యం డిమాండ్ చేశారు.