అనంతపురం: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. రమేష్ కుమార్ ను కులగజ్జి వెధవ అని నిందించారు. 

ఆదివారం రాయదుర్గంలో ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత ఎన్నికల కమిషనరున్నాడనే కులగజ్జి వెధవ అని ఆయన అన్నారు. తాను ఇలాగే మాట్లాడుతానని, తాను జైలుకు వెళ్లినా ఫరవా లేదని ఆయన అన్నారు. దేనికైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. 

Also Read: నిమ్మగడ్డతో ఒకే కంచం, ఒకే మంచం...గుర్తురాలేదా?: జగన్‌కు టిడిపి ఎమ్మెల్సీ చురకలు

రాజ్యాంగ పదవిలో ఉండి కులాన్ని అడ్డంగా వాడుకుని, తన సామాజిక వర్గాన్ని వాడుకుని ఈ రోజు రూ.5,800 కోట్లు రాష్ట్రానికి రాకుండా చేస్తూ జగన్ మీద కక్ష తీర్చుకోవడానికి సిద్ధపడ్డారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజలపై కక్ష తీర్చుకుంటున్నారా అని ఆయన ప్రశ్నించారు. 

కుట్ర పన్ని రాష్ట్రానికి నిధులు రాకుండా చేస్తారా అని ప్రశ్నించారు. సిగ్గు లేదా మీకు, మనుషులు కారా మీరు అని అడిగారు. టీడీపీకన్నా నీచమైన వైరస్ ఏదీ లేదని ఆయన అన్నారు.

శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేత చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన రమేష్ కుమార్ కు టీడీపి గ్రాఫ్ పడిపోతుండడం నచ్చలేదని, అందుకే ఎన్నికలను వాయిదా వేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఆరోపించారు. రాష్ట్రానికి రూ.5 వేల కోట్ల రూపాయలు రాకుండా చేయాలనే కుట్ర భాగంగానే ఎన్నికలను వాయిదా వేశారని కూడా ఆయన అన్నారు.

Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు బుచ్చయ్య చౌదరి "నిమ్మగడ్డల" పంచ్!

వైఎస్ జగన్ విమర్శల తర్వాత వైఎస్సార్ కాంగ్రెసు నాయకులు, ఎమ్మెల్యేలు రమేష్ కుమార్ పై కులం ప్రస్తావన చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే కాపు రామచంద్రా రెడ్డి కూడా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.