హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లోని పేదలకు కల్పించిన 10 శాతం రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ అమలుకు నోచుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు హామీకి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాపులు సామాజికంగా వెనకబడి ఉన్నందున రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు చంద్రబాబు గతంలో చెప్పారు. ఆ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపించారు. దానికి కేంద్రం అనుమతి ఇవ్వలేదు సరి కదా, అది సాధ్యం కాదని కూడా చెప్పేసింది. 

కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనబడిన వర్గాలకు (ఈబీసీలకు) పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసింది. ఈ పది శాతం కోటాలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తామని చంద్రబాబు చెబుతున్నారు. ఈబీసి రిజర్వేషన్లు అగ్రవర్ణాల్లోని పేదలకు ఉద్దేశించినవి కాబట్టి సామాజికంగా వెనకబడిన వర్గంగా భావిస్తున్న కాపులు ఆ కోటాలోకి ఎలా వస్తారనే ప్రశ్న ఒకటి ఉదయిస్తోంది.

మరో వైపు, కోటాలో కోటా సాధ్యం కాదని కొంత మంది న్యాయ నిపుణులు అంటున్నారు. పదిశాతం కోటాలో కాపులకు ఐదు శాతం కేటాయిస్తామని చంద్రబాబు అంటున్నారు కాబట్టి అది కోటాలో కోటా కిందికి వస్తుందని, అందువల్ల దాన్ని అమలు చేయడం సాధ్యం కాదని అంటున్నారు. అయితే, ఆపరేషనల్ రూల్స్ ను రూపొందించుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, అందువల్ల కాపు కోటాను అమలు చేయడానికి వీలవుతుందని వాదించే న్యాయవాదులు కూడా ఉన్నారు. 

అయితే, ఈబీసి కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామనే చంద్రబాబు హామీకి మాత్రం న్యాయపరమైన చిక్కులు తప్పవనే వాదన బలంగా వినిపిస్తోంది.

సంబంధిత వార్త

అందుకే కాపులకు 5శాతం రిజర్వేషన్లు.. చంద్రబాబు