కన్నాతో కాపు నేత ముద్రగడ ఏకాంత భేటీ: మతలబు ఏమిటి?

Kapu leader Mudragada meets Kanna
Highlights

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మినారాయణతో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏకాంత చర్చలు జరిపారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా నియమితులైన కన్నా లక్ష్మినారాయణతో కాపు నేత ముద్రగడ పద్మనాభం ఏకాంత చర్చలు జరిపారు. బిజెపి అధ్యక్షుడిగా నియమితులైనట్లు తెలిసిన వెంటనే కన్నాను ఆయన ఆదివారం కలిశారు 

ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో ఈ భేటీ ప్రాధాన్యాన్ని సంతరించుకుందని అంటున్నారు. అయితే, కాంగ్రెసులో ఉన్నప్పుడు ఇద్దరు మంచి మిత్రులు. దానివల్ల శుభాకాంక్షలు చెప్పడానికి మాత్రమే ఈ భేటీ జరిగిందని అంటున్నారు. 

కన్నా ఇంటికి పెద్ద యెత్తున అభిమానులు చేరుకున్నారు. కన్నా లక్ష్మినారాయణను బిజెపి అధ్యక్షుడిగా నియమించిన అధిష్టానం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై నిరంతర పోరాటం చేస్తున్న సోము వీర్రాజును రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ కన్వీనర్ గా నియమించింది.

తనను బిజెపి అధ్యక్షుడిగా నియమించినందుకు కన్నా లక్ష్మినారాయణ ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తానని కన్నా లక్ష్మినారాయణ మీడియాతో అన్నారు. 

అందరి సహకారంతో పార్టీని ముందుకు నడిపిస్తానని, బిజెపితోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజలు వాస్తవాలు గుర్తించాలని అన్నారు. ఎపికి కేంద్రం చేసిన సాయాన్ని వివరిస్తామని, కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతామని ఆయన చెప్పారు.

loader