కాపు నేతలపై కేసుల ఎత్తివేత.. స్పందించే మనసు లేదా : పవన్‌పై కాపు కార్పోరేషన్ ఛైర్మన్ ఆగ్రహం
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ కాపు కార్పోరేషన్ ఛైర్మన్ అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో తునిలో రైలు దహనం ఘటనకు సంబంధించి కాపు నేతలపై పెట్టిన కేసులను ఎత్తేసినందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు చెప్పడంపై శేషు మండిపడ్డారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమ సమయంలో (kapu reservation movement) తునిలో రైలు దహనం ఘటనకు (tuni train incident) సంబంధించి కాపు నేతలపై (kapu leaders) పెట్టిన కేసులను ఏపీ ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు (ys jagan) కాపు నేతలు ధన్యవాదాలు తెలిపారు. కేసుల ఎత్తివేతకు కృతజ్ఞతగా ఆయన చిత్రపటానికి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు (adapa seshu), కాపు సంఘాల నేతలు విజయవాడలో క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా అడపా శేషు మాట్లాడుతూ.. సీఎం జగన్ తన పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని నెరవేర్చారని ఆయన ప్రశంసించారు. రైలు ఘటనకు సంబంధించిన కేసులన్నీ ఎత్తేశారని తెలిపారు. పవన్ కల్యాణ్ (pawan kalyan) కేవలం చంద్రబాబు (chandrababu) రాసిచ్చిన స్క్రిప్ట్ కే స్పందిస్తున్నారని, కాపులకు సంబంధించి ప్రభుత్వం మంచి జీవో ఇచ్చినా స్పందించే మనసు రాలేదని అడపా శేషు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడప్పుడు ఇలాంటి వాటిపైనా స్పందించాలని ఆయన పవన్‌కు హితవు పలికారు.
చెప్పింది చేయడం జగన్ నైజమని, అది ప్రపంచానికి తెలిసిన సత్యమంటూ అడపా శేషు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు తీరు మార్చుకోకుంటే ఈసారి డిపాజిట్లు కూడా దక్కవని ఆయన హెచ్చరించారు. కాపులకు పదవులిచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని.. కుల, మత, ప్రాంత, జాతి భేదాలు లేని సీఎంను బాధపెట్టడం భావ్యం కాదని శేషు హితవు పలికారు.
అంతకుముందు కాపు ఉద్యమ సమయంలో అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేసినందుకు ముద్రగడ పద్మనాభం (mudragada padmanabham) హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ధన్యవాదలు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ముద్రగడ.. ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. చెయ్యని నేరానికి తమను ముద్దాయిలను చేస్తూ పెట్టిన కేసులు అన్యాయం అని పేర్కొన్నారు. స్వయంగా వచ్చి తాను ధన్యవాదాలు తెలపాలని ఉన్నా కలవలేని పరిస్థితి ఉందన్నారు. ఒకవేళ తాను మిమ్మల్ని కలిసినా కాపు జాతిని తాకట్టు పెట్టి పదవుల కోసం వెళ్లి కలిశారని కొందరు విమర్శలు చేస్తారన్నారు.
‘‘మా జాతి ఉద్యమం నుంచి నన్ను తప్పించినా, ఆ కేసులకు మోక్షం కలిగించారు. కాపులను బీసీ – ఎఫ్ లో చేర్చి కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపినప్పుడు కూడా అప్పటి సీఎం చంద్రబాబుని కలిసి ధన్యవాదాలు తెలపాలనుకున్నా. అలా చేస్తే జాతిని పదవుల కోసం.. డబ్బులు కోసం అమ్మేసుకున్నాను అని అంటారని భయపడ్డా. అందుకే మిమ్మల్నీ కలవలేకున్నాను. చాలా మంది పెద్దలు రకరకాల సమస్యలతో మీ ఇరువురి వద్దకు వచ్చినా తప్పు పట్టారు. నేను ఎప్పుడో చేసుకున్న పాపం అనుకుంటాను’’ అంటూ ముద్రగడ కృతజ్ఞతలు చెబుతూనే ఆవేదన వ్యక్తం చేశారు.