చంద్రబాబుకు మానసిక రోగం, ఏపికి ప్రమాదం: కన్నా

Kanna says Chandrababu is suffering from mental illness
Highlights

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బిజెపి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని విమర్శించిన చంద్రబాబు, ఇప్పుడు ఆ పార్టీనే న్యాయం చేసిందని మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 

చంద్రబాబులో ఒక అపరిచితుడిని చూస్తున్నామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చంద్రబాబుకు ఉన్న మానసిక రోగంతో రాష్ట్రానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు. పోలవరం ఏడు ముంపు మండలాలను బిజెపియే ఆంధ్రాలో కలిపిందని, ఆ విషయం మర్చిపోయి చంద్రబాబు మాట్లాడుతున్నారని విమర్శించారు. 
మోడీ ముంపు మండలాలను ఆంధ్రాలో కలపకపోతే పోలవరం కలగానే మిగిలిపోయేదన్నారు.  కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా పోలవరం అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెంచేస్తుందని ఆరోపించారు. పోలవరానికి పెండింగ్ బిల్లు బకాయిలు లేవని పోలవరం అథారటి అధికారులు చెపుతున్నారని తెలిపారు. 

సమాచార హక్కు చట్టం ద్వారా తాము వివరాలు అడిగితే పోలవరం ప్రాజెక్టుకు పాత బకాయిలు లేవని వచ్చిందని ఆయన చెప్పారు. చంద్రబాబు రూ.1950 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అబద్దం చెపుతున్నారని అన్నారు. 

కడప స్టీల్ ప్లాంట్ రావాలనే ఉద్దేశ్యం టీడీపీకి లేదని, రాష్ట్ర అభివృద్ధిని చంద్రబాబు సైంధవుడిలా అడ్డుకుంటున్నారని విమర్శించారు  కేంద్రం ఉక్కు పరిశ్రమ ఇస్తుందని తెలిసే టీడీపీ నాయకులు ప్రాణ త్యాగానికి సిద్ధమనే డ్రామాలు ఆడుతున్నారని ఆయన విమర్శించారు.

loader