విజయనగరం: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై మాజీమంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు క్లారిటీ లేని వ్యక్తి అంటూ విమర్శించారు. విజయనగరం జిల్లాలో పర్యటించిన ఆయన విభజన హామీల అమలుపై బీజేపీకి స్పష్టత ఉందన్నారు. 

అందుకే విభజన హామీలకు సంబంధించి ఇచ్చిన హామీలను అమలు చేశామని చెప్పుకొచ్చారు. అయితే విభజన హామీలపై చంద్రబాబుకి కనీస అవగాహన లేదని అందుకే రాష్ట్ర ప్రజలను కన్ఫ్యూజన్ చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు మాతో ఉన్నారా లేక వేరే పార్టీతో ఉన్నారా అన్నది తమకు సంబంధం లేదన్నారు. 

రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడమే ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమని కన్నా లక్ష్మీనారాయణ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ కి ఎక్కువ నిధులు ఇచ్చినా చంద్రబాబుకి ఉన్న అనుకూల మీడియా తమ గొంతు ప్రజల్లోకి వెళ్లనియ్యడం లేదన్నారు. అందుకే ఇంటింటికి బీజేపీ వంటి కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నట్లు తెలిపారు. 

చంద్రబాబుకు నిజం చెప్పడం రాదని విమర్శించారు. నిత్యం మోసపూరిత కార్యక్రమాలు, అబద్దాలతో పబ్బం గడుపుతున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలను రద్దు చేశామని చెప్పిన చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని అదే కమిటీలతో నిర్వహిస్తున్నారని తెలిపారు. 

నాలుగున్నరేళ్లుగా కాంగ్రెస్ పార్టీని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అదే కాంగ్రెస్ తో కుమ్మక్కైయ్యారని విమర్శించారు. ప్రజల సొమ్ముతో రాష్ట్రాలు తిరిగి అందరికీ శాలువాలు కప్పుతున్న చంద్రబాబు ఏ కూటమి అధికారంలోకి వస్తుందో చెప్తాడేమోనన్నారు. 

చంద్రబాబు తల్లి కాంగ్రెస్ ను సంకలో పెట్టుకుని , పిల్ల కాంగ్రెస్ ను జేబులో పెట్టుకుని తిరుగుతున్నాడంటూ ఘాటుగా విమర్శించారు. ఇలా ఎందరితో అక్రమ సంబంధాలు పెట్టుకున్న చంద్రబాబును ఎవరూ ప్రశ్నించడం లేదన్నారు. 

కడప స్టీల్ ప్లాంట్ , దుగ్గరాజు పట్నం పోర్ట్, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసి తీరుతామన్నారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా అంటూ మండిపడ్డారు.